ప్రస్తుతం ఏపీలో పవన్ కల్యాణ్ గ్రాఫ్ కాస్త పైకి లేచింది. రాజధాని ప్రాంతంలో రైతులను భూసేకరణ నుంచి తాత్కాలికంగానైనా గట్టెక్కించిన క్రెడిట్ పవన్ ఖాతాలోకే వెళ్లింది. ఈ 
విషయంలో బాబు సర్కారు చాలా ఇరకాటంలోనే పడినట్టు కనిపిస్తోంది. ఓవైపు వేలాది ఎకరాలు సేకరించేశారు. ఇప్పుడు కొన్నిగ్రామాలను వదిలేస్తే మొదటికే మోసం వస్తుంది. దీనిపై సర్కారు ఎలాంటి వైఖరి తీసుకున్నా.. ప్రస్తుతానికైతే ఆ గ్రామాల జోలికి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. 

ఐతే.. రాజధాని భూముల విషయంలో పవన్ పైచేయి సాధించినా.. కొన్ని పక్షాల నుంచి మాత్రం విమర్శలు తప్పడం లేదు. ప్రత్యేకిచి ప్రత్యేక హోదా విషయంలో ఆయన మెతకవైఖరి అవలంబిస్తున్నట్టే కనిపిస్తోంది. ఈ అంశంపై మరికొంత కాలం వేచి చూద్దామని ఆయన ట్వీట్ చేయడం విమర్శలకు ఆస్కారమిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై 3,4 ఆత్మహత్యలు కూడా నమోదయ్యాయి. 

ప్రత్యేక హోదాపై ఇంకొంతకాలం వేచి చూద్దామన్న పవన్ వైఖరిని సీపీఐ ప్రశ్నిస్తోంది. ఇంకెంత కాలం వేచి ఉండాలంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ఆత్మహత్య చేసుకున్న సంగతి పవన్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. మోడీకి తాను దగ్గర అని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని రాష్ట్రానికి మేలు చేయాలని రామకృష్ణ కోరారు. 

ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో జనసేన తప్ప మిగిలిన రాజకీయ పక్షాలు ఓ అడుగు ముందుకేశాయి. సీపీఐ ఈనెల 11న బంద్ కు పిలుపు ఇచ్చింది. మొన్నటికి మొన్న వైసీపీ బంద్ నిర్వహించింది. ఇక రాష్ట్ర్రంలో ఈ అంశంపై ఆందోళన చేయని పార్టీ ఒక్క జనసేన మాత్రమే.. మిత్రపక్షంగా చెప్పుకుంటున్న జనసేన ఈ అంశంపై కఠిన వైఖరి అవలంబిస్తుందా.. సర్దుకు పోతుందా అన్ని తేలాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: