ప్రత్యేకహోదా కోసం రాష్ట్రంలో ప్రజల తరఫున ఒక పోరాటం మొదలయ్యే సూచన ఉండేట్లయితే దానిని పురుడు పోసుకోకుండా తొక్కేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చినట్లయితే.. ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆయన నమ్ముతున్నారో లేదో మనకు స్పష్టత లేదుగానీ... ఆ హోదా కోసం ప్రజల తరఫున ఒక పోరాటం జరగడాన్ని మాత్రం ఆయన విశ్వసించడం లేదు. ఏడాదిగా ఎలాంటి కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను వంచన గాటన కట్టేస్తూ ఉన్నారో.. ఇప్పుడు కూడా అదే తరహా మెరమెచ్చు మాటలు చెప్పి.. ప్రజల్లో పోరాటస్ఫూర్తిని తొక్కడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 


రాష్ట్ర శాసనసభలో ప్రత్యేకహోదాకు సంబంధించిన వైకాపా పోరాటంపై సీఎం చేసిన ప్రకటన, అది మౌఖికంగా పూర్తికాకపోయినా.. ఆయన సభికులకు అందచేసిన ప్రకటన ప్రతిలోని వివరాలు ఇలాంటి అనుమానాలనే రేకెత్తిస్తున్నాయి. 


ప్రకటనలోని హైలైట్‌ అనదగిన చంద్రబాబు వ్యాఖ్యలను గమనిస్తే చాలు. ఆయన ఈ విషయంలో ఎంతగా పలాయనమంత్రం పఠిస్తున్నారో అర్థం అవుతోంది. ఇప్పుడు రాష్ట్రం - దాని ప్రత్యేకహోదా గురించి కేంద్రంలో ఉన్న పెద్దలంతా తూచ్‌ అనేస్తూ మాట మారుస్తున్న కీలక తరుణంలో.. పరిస్థితి చేయి దాటిపోతున్నదని అనిపిస్తుండగా.. ఆందోళన చెందుతున్న ప్రజల తరఫున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ఉద్యమస్వరాన్ని వినిపిస్తూ ఉంటే.. చంద్రబాబునాయుడు.. దాన్ని కూడా తొక్కేసే ప్రయత్నం చేయడం ఆశ్చర్యకరం. 


'ప్రత్యేకహోదాపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు జగన్‌ ఎకకడున్నాడు?' లాంటి మాటలు ఇప్పుడు సంబంధం లేనివి. ఏపీకి ప్రత్యేకహోదా అర్హత ఉంది.. అప్పటి ప్రధాని చేసిన వాగ్దానం అమలు చేయాలి.. అంటున్న సీఎం చంద్రబాబు.. ఎవరు అమలు చేయాలో చెప్పడం లేదు. హోదా కోసం తమ ప్రభుత్వం కేంద్రంపై అన్ని రకాలుగా వత్తిడి చేస్తోంది.. అని ప్రకటనలో పేర్కొన్న చంద్రబాబు.. అలాంటి వత్తిడికి ప్రజలుకూడా తమ ఆందోళనల ద్వారా మద్దతు ఇస్తోంటే మాత్రం.. ఎందుకు వద్దంటున్నారో అర్థం కావడం లేదు. 


చంద్రబాబు ఇలాంటి మాయమాటలను వల్లించినంత కాలమూ.. ఏపీకి హోదా వస్తుందనుకోవడం కల్ల. చంద్రబాబు కూడా తాను వత్తిడి తెచ్చినా, ప్రతిపక్షం పోరాడినా, ప్రజలు ఆందోళన చెందినా.. రూపం ఎలాంటిదైనా సరే.. దానివలన మేలు జరిగేది రాష్ట్రానికే అనే సంగతిని గుర్తించాలి. హోదా వస్తే.. దాని ద్వారా జరిగే అభివృద్ధి తన ప్రభుత్వ హయాంలోనే జరుగుతుందని ఆయన ఎందుకు అర్థం చేసుకోవడంలేదో తెలియడం లేదు. ఇప్పటికైనా ఆయన వైఖరి మార్చుకుని.. ప్రజల పోరాటానికి మద్దతిచ్చి.. హోదాకోసం వారితో కలిసి ప్రయత్నిస్తే తప్ప.. ఈ రాష్ట్రానికి మంచి జరగదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: