ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. హోదా కోసం తీర్మానం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సభలో మాట్లాడటం మొదలుపెట్టారు. కాకపోతే.. తన స్వతహా ధోరణిలో.. మళ్లీ విభజన కథ మొదలుపెట్టారు. అలా చెబుతూనే వెళ్లారు. ఆ సుదీర్ఘ ప్రసంగాన్ని ప్రతిపక్షనేత జగన్ తట్టుకోలేకపోయారు. అందులోనూ ముందుగా చంద్రబాబు ఇచ్చిన నోట్ కూ ప్రసంగానికి పొంత లేకపోవడంతో జగన్ రెచ్చిపోయారు.   

చంద్రబాబు ప్రసంగానికి అడ్డు చెబుతూ.. స్పీకర్ గారూ.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఏమీ అర్థంకావడం లేదు.. ఆయనేం మాట్లాడుతున్నారు.. ఈ నోటు ఎందుకిచ్చారు.. దీనికో ముసుగు ఎందుకు.. ఈ నోట్ లో ఏముంది.. కావాలంటే చర్చే చేయండి.. ఈ నోట్ లో అంశాలు ఏమైనా ఉన్నాయా.. ఆయనేంటో చెబుతున్నాడు.. మేం వింటున్నాం.. ఏమేమో చెబుతున్నాడు. అప్పుడేం జరిగిందో అందరికీ తెలుసు.. మీరిచ్చిన నోట్ ను కూడా ఫాలో కారా.. ఇలా అయితే స్టేట్ మెంట్ ఎందుకు .. చర్చే పెట్టండి.. అంటూ సీఎం ప్రసంగానికి అడ్డు చెప్పారు. 

తన సీరియస్ ప్రసంగానికి అడ్డు చెప్పేసరికి చంద్రబాబుకు మండిపోయింది. అధ్యక్షా.. సభలో చాలా సాంప్రదాయం ఉంది. నోట్ అనేది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తాం.. పాపం జగన్ కు స్టేట్ మెంట్.. ఫస్ట్ టైమ్ కాబట్టి ఆయనకు అవగహన లేనట్టుంది. కావాలంటే జగన్ క్లారిఫికేషన్ అడగొచ్చు. స్టేట్ మెంట్ కు ముందూ వెనుకా ఉంటుంది.. జగన్  ఓసారి రూల్స్ చదువుకోండి... అంటూ కౌంటర్ ఇచ్చారు. 

అక్కడితో ఆగలేదు.. జగన్ కావాలనుకుంటే.. ఓన్లీ స్టేట్ మెంట్ ఇస్తా.. అలా ఇస్తే చర్చకు ఆస్కారం ఉండదు.. చర్చకు ముందు అన్నీ ఉంటాయి.. ఇది మీకే కాదు.. ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా.. ఇంపార్టెంట్ ఇష్యూను డైల్యూట్ చేయొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా.. వందల వేలు స్టేట్ మెంట్లు ఇచ్చా.. ఏది స్టేట్ మెంటో.. ఏది చర్చో నాకు తెలియదా అంటూ క్లాస్ పీకారు. జగన్ హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలన్నారు. ముందు జగన్ సబ్జక్ట్ పై ఇంట్రస్ట్ పెంచుకోవాలని చురకలంటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: