ఆంధ్రా ముఖ్యమంత్రి గెటప్ పరిశీలిస్తే ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అదే ముదురు గోధుమ రంగ దళసరి చొక్కా.. అదే రంగు ప్యాంటు.. ఎక్కడకు వెళ్లినా ఇదే డ్రెస్ కోడ్.. గతంలో లేదు కానీ ఈ మధ్య తరచూ కళ్లజోడు కూడా వాడుతున్నారు. చంద్రబాబు గడ్డం కూడా వెరయిటీగా ఉంటుంది. ఫ్రెంచ్ టైప్ లో కేవలం కొద్ది భాగంలోనే కనిపించే ఈ తెల్లగడ్డం అంటే కార్టూనిస్టులకు చాలా ఇష్టం. బాబు బొమ్మ గీయాలంటే వారు అదే హైలెట్ చేస్తారు. 

మరి అలాంటి చంద్రబాబు మేకప్ వేసుకుంటారా.. అంటే లేదనే చెబుతారు ఎవరైనా.. కానీ ఏపీ ప్రతిపక్షనేత కొత్త విషయం బయటపెట్టారు. చంద్రబాబు మేకప్ వేసుకున్నారని చెబుతున్నారు. అదీ ఏ రోజో తెలుసా.. పుష్కరాల తొలిరోజు.. చంద్రబాబు మేకప్ వేసుకున్నారని ఆరోపిస్తున్నారు. పబ్లిసిటీ మోజుతో మొదటి రోజు చంద్రబాబు వీఐపీఘాట్ లో స్నానం చేయకుండా మేకప్ వేసుకుని పుష్కర ఘాట్లో స్నానం చేయడానికి వచ్చారని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు పుష్కరాల ఘాట్ లో గంటల తరబడి స్నానం చేయడం వల్లే.. జనం కిక్కిరిసిపోయి తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారని జగన్ ఆరోపించారు. ఓ మనిషిని పొడిచి చంపి నివాళులు అర్పించడం ఏం సంస్కృతి అని అసెంబ్లీలో నిలదీశారు. పుష్కరాల్లో చనిపోయిన మృతుల సంతాపం కోసం తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో జగన్ ఈ ప్రసంగం చేశారు. ఐతే సంతాప తీర్మానం సమయంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. 

సాధారణంగా సంతాప తీర్మానం సమయంలో కాంట్రావర్సీ ఉండదు. గొడవ జరగదు.. చనిపోయింది ఎవరైనా నిశబ్దంగా మౌనం పాటించడమే తప్ప గొడవలుండవు.. కానీ పుష్కరాల సమయంలో చంద్రబాబు వైఖరి వల్లే ప్రమాదం జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న వైసీపీ అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని వివాదాస్పదం చేసింది. అసలు చనిపోయినవారు ఎలా చనిపోయారో తెలుసుకోకుండా వారికి సంతాపం తెలపడమేంటని ఆరోపిస్తూ టీడీపీని ఇరుకునపెట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: