భారతీయ జనతా పార్టీ నుంచి నాగం జనార్దనరెడ్డిని వెలివేయడం అనే పర్వం పూర్తయినట్లేనా అని రాజకీయ వర్గాల్లో సంచలన చర్చ జరుగుతోంది. ఆయన ఇప్పటిదాకా అధికారికంగా వెలుపలికి రాలేదు. ఆయన పార్టీని వీడలేదు. అలాగని పార్టీ కూడా ఆయనను వదిలించుకోలేదు. కానీ పొమ్మనకుండా పొగపెట్టడం అనే సిద్ధాంతాన్ని మరో రకంగా ఆయన మీద ప్రయోగిస్తూ సక్సెస్‌ అయినట్లు కనిపిస్తోంది. ఆయనను పార్టీనుంచి వెలివేయకుండానే.. వెలివేసినంత సంకేతాలు.. ప్రజల్లోకి పంపడానికి, నాగం నుదుటన ఉన్న కాషాయముద్రను బలవంతంగా చెరిపివేయడానికి పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. 


నాగం జనార్దనరెడ్డి.. తన సొంత పార్టీకి సంధికొట్టి.. భాజపాలో చేరిన తర్వాత.. తొలిరోజుల్లో మాత్రమే ఆయన ప్రాభవం కాస్త వెలుగుతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత.. ఆయనను ఒక నాయకుడిగా పట్టించుకున్న దిక్కే లేకుండాపోయింది. తీరా ఎన్నికల్లో కూడా ఆయన మరియు కొడుకు ఇద్దరూ ఓటమి పాలవడంతో.. భాజపా నాయకత్వం వారిని తేలిగ్గా తీసుకుంది. నిజానికి సెంటిమెంటు ముడిపడి జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో వాయిస్‌ ఉన్న నాయకులు ఒకరిద్దరు ఓడినా సరే.. పార్టీ వారికి అండగ నిలబడాల్సిందిపోయి.. పార్టీ భిన్నంగా వ్యవహరించడంతో.. నాగం జనార్దనరెడ్డి కూడా క్రమంగా దూరం అవుతూ వచ్చారు. 


ఒక దశలో నాగం.. తెలంగాణలో పెండింగు ప్రాజెక్టుల పూర్తికోసం రాష్ట్రవ్యాప్త టూరు ప్లాన్‌చేస్తే.. పార్టీనుంచి లభించిన సహకారం సున్నా. ఆ ప్రయత్నం మొత్తం అయిన తర్వాత.. ఆయన తెలంగాణ విమోచన వేదిక అంటూ తనకోసం తాను ఒక ప్లాట్‌ఫాం సృష్టించుకున్నారు. అది రాజకీయ పార్టీనా కాదా అనే స్పష్టత లేదు. అయితే.. అన్ని పార్టీల వారికి ఇందులో ప్రమేయం ఉంటుందని మాత్రం సెలవిచ్చారు. ఆ తర్వాత.. నాగంను మరింత దూరం పెట్టిన భాజపా.. తాజాగా ఆయనను వెలివేసినట్లే అనే సంకేతాలు కూడాపూర్తిచేసింది. ఆయన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ నుంచి పెండింగు ప్రాజెక్టులకోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తూ.. ఆయన హాజరీ కూడా లేకుండా సభను నిర్వహించి దులిపేసుకున్నారు. నిజానికి ఏదో నాగం వెలిని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఈ సభ చేసినట్లు ఉన్నదే తప్ప.. నిజంగా ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి పోరాటం అన్నట్లుగా లేదు. అలా ఉన్నట్లయితే.. కిషన్‌ బృందం పోరాడాల్సిన పద్ధతి కూడా ఇది కాదు అని పలువురు విశ్లేషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: