అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్రజలకురుచి చూపిస్తాం అనే తరహా నినాదాలతో ఆంఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. రాజకీయంగా గాని, పరిపాలన పరంగా గానీ అంతగా అనుభవం లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ సారథి అరవింద్‌ కేజ్రీవాల్‌ కిందా మీదా పడుతూ.. కేంద్రంతో చాన్సు దొరకినప్పుడెల్లా సున్నం పెట్టుకుంటూ.. పరిపాలన నడిపిస్తున్నారు. రకరకాల అవస్థల మధ్య ఆ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. కొంత మంది ఆ పార్టీలోని మంత్రులు సాంప్రదాయ రాజకీయ నాయకుల్లాగా.. అవినీతి ఆరోపణల్లో కూరుకోవడమూ, ఇబ్బందులు పడడమూ కూడా జరుగుతోంది. 


ఇలాంటి సమయంలో.. అసలైన ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో... ఆప్‌ పార్టీకే చెందిన ఒక ఎమ్మెల్యే కేజ్రీవాల్‌కు రుచిచూపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఆందోళనకు పూనుకున్నారు. ప్రభుత్వం తాను లేవనెత్తుతున్న సమస్యలపై స్పందించి, పరిష్కరించే వరకు మడమ తిప్పేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. 


ఇంతకూ సంగతేంటంటే.. ఢిల్లీలోని సంగం విహార్‌ ప్రాంతంలో డెంగీ జ్వరాలు బాగా ప్రబలాయి. నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం స్పందన నామమాత్రంగానే ఉంది. సామాన్యుల పార్టీగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్ని మాటలైనా చెబుతూ ఉండవచ్చు గానీ.. అక్కడ అందుతున్న సాయం తక్కువే. దీనిపై అధికార పార్టీకే చెందిన వాడు అయినప్పటికీ.. అక్కడి ఎమ్మెల్యే పంకజ్‌ పుష్కర్‌కు చిర్రెత్తుకొచ్చింది. అక్కడి ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత తనకు ఉన్నదంటూ.. ఉద్యమబాట పట్టాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆందోళన ప్రారంభించారు. రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడినా ఫలితం లేదంటూ వాపోతున్నారు. అయితే ఆప్‌ సారధి కేజ్రీవాల్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. 


అదే మన రాష్ట్రంలో అయితే.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయితే.. తన నియోజకవర్గ ప్రజలు ఎలా చస్తున్నా సరే.. ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట విమర్శించడానికి సాహసిస్తారా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: