గత ఎన్నికల్లో టీడీపీని గెలిపించినవేంటి.. సోనియా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయమా.. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ, డ్వాక్రా మాఫీ, బాబు-జాబు, వెయ్యి రూపాయల ఫించను హామీలా.. కొత్త రాష్ట్రాన్ని బాబయితే నడిపిస్తాడన్న నమ్మకమా.. వీటిలో ఏది చంద్రబాబు ను గెలిపించింది. వీటిలో ఎక్కువ మంది చివరి అంశానికే ఎక్కువ ఓట్లేస్తారు. 


ఒక విధంగా రాష్ట్ర విభజన ద్వారా సోనియా చంద్రబాబుకు రాజకీయ పునరుజ్జీవం కలిగించారన్న వాదన కూడా ఉంది. అప్పటివరకూ జగన్ వైపు మొగ్గున్నా... రాష్ట్రం విడిపోవడంతో.. జగన్ లాంటి కుర్రాడి కంటే.. చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడికే అవకాశం ఇవ్వాలని ఆంధ్రాప్రజలు డిసైడయ్యారంటారు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీకి చేసిన సాయం కూడా తక్కువేమీకాదు.. అలాగే బీజేపీతో దోస్తీ కూడా టీడీపీకి లాభించింది. 

ఇదే అంశం లేటెస్టుగా శాసన మండలిలో హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కల్యాణ్ కాళ్లు, మోడీ గడ్డం పట్టుకునే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య  హాట్ హాట్ కామెంట్లు చేశారు. కరవు అంశంపై మండలిలో చర్చ జరుగుతున్న సమయంలో రామచంద్రయ్య ఈ కామెంట్లు చేశారు. తన ప్రసంగాన్ని పదే పదే అడ్డుకుంటున్న టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఆర్ ఇలా తన ఆవేశం తీర్చుకున్నారు. 

సీఆర్ కామెంట్లతో ఒక్కసారిగా డిఫెన్సులో పడిపోవడంతో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అందుకున్నారు. పవన్ కల్యాణ్ వల్ల టీడీపీకి ఓట్లేమీ పెరగలేదని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ ఎలాంటి పొత్తు లేకుండానే మెజారిటీ స్థానాలు దక్కించుకుందని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే రాజధాని భూముల విషయంలో టీడీపీకి-పవన్ కు గ్యాప్ పెరిగిన నేపథ్యంలో పయ్యావుల కామెంట్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: