సభను స్తంభింపజేయడమూ, సభా కార్యకలాపాలకు అడ్డు పడడమూ, విపరీత ధోరణితో ప్రవర్తించడమూ వంటి అనేక తప్పిదాలు తరచూ మన చట్టసభల్లో జరుగుతూనే ఉంటాయి. అవేవీ.. సభ్యులు తెలియక చేసే తప్పులు కావు. తమ నిరసనల్ని గరిష్టంగా తెలియజేయడానికి నాయకులు ఇలా ప్రవర్తిస్తుంటారు. ఆవేశంలోనూ ఇవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు సభ్యులపై స్పీకరు చర్య తీసుకుంటూ ఉంటారు. కానీ.. ఒక ఫోటోను ఉంచడమూ- తొలగించడమూ అనే వివాదానికి సంబంధించి కూడా.. సభ్యులపై చర్య తీసుకునే వరకూ పరిస్థితులు విషమించడం అనేది.. ఏపీ అసెంబ్లీలో చిత్రమైన పోకడగా కనిపిస్తోంది. 


ఏపీ అసెంబ్లీ లాంజ్‌లోంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటోను తొలగించడం అనే అంశానికి సంబంధించి కొన్నాళ్లుగా చాలా పెద్దస్థాయిలో రగడ జరుగుతూన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ అంశంకుదిపేస్తోంది. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ ఫోటోను తొలగించడం కరెక్టు కాదని, దానిని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని వైకాపా డిమాండ్‌ చేస్తుండగా.. స్పీకరు కోడెల శివప్రసాద్‌ దానిని ఖాతరు చేయడం లేదు. 


ఈ ఉదంతాన్ని వైకాపా ఎమ్మెల్యేలు బుధవారం నాడు మరింత ఉధృతమైన స్థాయికి తీసుకువెళ్లారు. వైఎస్సార్‌ వర్ధంతి నాడు.. ఈ వ్యవహారం శాసనసభలో పెద్ద దుమారంగా మారింది. వైఎస్‌ ఫోటోలు ప్లకార్డుల్లా పట్టుకుని వైకాపా సభ్యులు ఆయన ఫోటోను తిరిగి ప్రతిష్ఠించాల్సిందేనంటూ పెద్దఎత్తున ఆందోళన చేశారు. వైఎస్‌ ఫోటోలను అసెంబ్లీ లాంజ్‌లో గోడలకు అతికించారు. దీనిపై చర్చ కూడా జరిగింది. చివరికి స్పీకరు కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. సభా నియమాలను ఉల్లంఘించి.. అసెంబ్లీలో ఫోటోలను ప్రదర్శించిన, గోడలపై వైఎస్‌ ఫోటోలను అతికించిన వైకాపా సభ్యులపై చర్య తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వైఎస్‌ ఫోటో తిరిగి ఏర్పాటు చేసే విషయంలో మాత్రం నిర్ణయం రాలేదు. ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఫోటో అంటూ కొట్టి పారేశారు. మొత్తానికి వైఎస్‌ ఫోటో కోసం పోరాటం చేసినందుకు.. ఆయన వర్ధంతి నాడు ఫోటోలను ప్రదర్శించినందుకు.. వైకాపా సభ్యులపై స్పీకరు చర్య తీసుకునే ప్రమాదం కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: