చిడతలు వాయించడం.. పొగడ్తలను మహ రంజుగా వినిపించడం.. తద్వారా తమకు సానుకూల అవకాశాలను సృష్టించుకోవడం ఇదంతా.. ప్రతిరంగంలోనూ సర్వసాధారణం. కానీ, రాజకీయాలు, సినిమా రంగాల్లో ఇది మరీ శృతిమించి కనిపిస్తూ ఉంటుంది. హద్దూ అదుపూ లేకుండా.. చిడతలు వాయించేస్తుంటారు. పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు. సినిమా ఫంక్షన్లలో చూస్తే.. ఎంత విచ్చలవిడిగా ఒకరినొకరు కీర్తిస్తూ ఉంటారో మనకు తెలుస్తుంది. రాజకీయాల్లో కూడా ఇది సహజం. పార్టీ లేదా అధికార పగ్గాలు చేతిలో ఉన్న నాయకుల్ని.. వారి పార్టీలోని చిన్నా సన్నా నాయకులంతా.. పదేపదే కొనియాడుతుంటారు. తమ నేతను మించిన వారు ఈభూలోకంలో ఉండరంటూ చెబుతుంటారు. 


ఇలాంటి ప్రహసనమే మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా బుధవారం నాడు చోటు చేసుకుంది. ఈ పొగడ్తల కామెడీఎపిసోడ్‌లో ట్విస్టు ఏంటంటే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును.. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు.. ఎడాపెడా పొగిడేయడం. సభలో బుధవారం నాడు పట్టిసీమ ప్రాజెక్టు గురించిన చర్చ సందర్భంగా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పట్టిసీమ ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ.. తొలినుంచి వైకాపా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని పాలక పార్టీలు మాత్రం సమర్థించుకున్నాయి. 


పాటక కూటమిలోని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ.. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేయడం.. చంద్రబాబునాయుడుకు మాత్రమే సాధ్యమైందని ఆకాశానికెత్తేశారు. భాజపా తరఫున ఏపీ ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నానంటూ ఒక కొత్త అధికారిక ప్రకటన కూడా చేశారు. వైకాపా ప్రతి పనినీ విమర్శించడం మానుకోవాలని ఆయన నీతులు కూడా చెప్పేశారు. కాకపోతే.. అన్నిటినీ మించి.. పట్టి సీమ ప్రాజెక్టుకు ''చంద్రన్నర పట్టిసీమ'' అంటూ కొత్తగా నామకరణంచేయాలని ఆయన అసెంబ్లీలో రిక్వెస్టు వినిపించారు. 


ఏకంగా సీఎం చంద్రబాబు పేరును పట్టిసీమ ప్రాజెక్టుకు పెట్టాలనే ఆయన డైలాగు వినపడగానే.. ఈ చిడతలు వాయిచే స్థాయి చూసి.. అసెంబ్లీలో.. ముసిముసి నవ్వులు కనిపించాయి. ఆయన మాత్రం.. చంద్రబాబు తిరుగులేని నాయకుడని.. ఆయన పేరును ప్రాజెక్టుకు పెట్టాలని చెప్పుకొచ్చారు. సాధారణంగా ప్రాజెక్టులు, తదితర వాటికి నాయకుల పేర్లు పెట్టడం కొత్త విషయం కాదు గానీ.. వారు మరణించిన తర్వాత.. అలా పేరు పెట్టడం జరుగుతుంటుంది. అయితే చంద్రబాబునాయుడు జీవించిఉండగానే... ఆయన పేరును ప్రాజెక్టుకు పెట్టేయాలని భాజపా ఎమ్మెల్యే చెప్పడం మాత్రం చోద్యమే.


మరింత సమాచారం తెలుసుకోండి: