ఉల్టాచోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్న సామెత చందంగా ఉంది... పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వ్యవహరిస్తున్న తీరు! ఒకవైపు పాకిస్తాన్‌ దేశం తరఫున మిలిటరీ మన దేశపు సరిహద్దుల్లో.. కవ్వింపు కాల్పులకు నిరంతరాయంగా పాల్పడుతూ ఉండగా, మరోవైపు పాకిస్తాన్‌ ప్రభుత్వ మద్దతు తో చెలరేగిపోతున్న ఉగ్రవాదమూకలు భారత్‌లోకి చొరబడుతూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇటువైపు నుంచి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు వారికి పలుమార్లు హెచ్చరికలు చేస్తోంది. చాలా సందర్భాల్లో ఇలా జరుగుతోంది. ఉగ్రవాద చర్యలు, సరిహద్దు కవ్వింపులకు పాల్పడుతోంటే గనుక.. ఇరుదేశాల క్రికెట్‌ మ్యాచ్‌లు ఉండబోవంటూ బీసీసీఐ హెచ్చరించడం గతంలో జరిగేది. 


అయితే ఇప్పుడు పాక్‌ క్రికెట్‌ బోర్డు రివర్స్‌లో ఆడుతోంది. దొంగే పోలీసును వెంటబడి తరిమినట్లుగా.. వాళ్లే ఉగ్రవాదుల్ని చొరబెడుతూ, కవ్వింపు కాల్పులకు పాల్పడుతూ ఉండగా.. డిసెంబరులో మాతో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అంటూ మన క్రికెట్‌ బోర్డుకు ఫత్వా జారీచేస్తోంది. 


తమాషా ఏంటంటే.. భారత్‌తో ఆడే మ్యాచ్‌లే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు కల్ప తరువు వంటివి. భారత్‌తో మ్యాచ్‌ల వల్లనే ఆ బోర్డుకు అంతో ఇంతో ఆదాయం లభిస్తూ ఉంటుంది. అయితే.. భారత్‌తో మ్యాచ్‌లు ఓడిపోతే.. ఆ దేశపు ఆటగాళ్లకు ప్రమాదకర పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో.. భారత్‌తో ఆడడానికి వారు ఎగబడే పరిస్థితే ఉండాలి. దేశాల మధ్య వాతావరణం ఎలా ఉన్నా.. క్రీడా పోటీలు.. సుహృద్భావాన్ని పెంచుతాయని.. అంటూ వారు మ్యాచ్‌లకు రిక్వెస్టు చేసే పరిస్థితి ఉండాలి. అలాంటిదేమీ జరగడం లేదు. వారు రివర్సులో మనల్ని బెదిరిస్తున్నారు. 


ఐసీసీ షెడ్యూలు ప్రకారం.. ఈ ఏడాది చివర్లో డిసెంబరులో ఈ రెండు దేశాల మధ్య సిరీస్‌ జరగాల్సి ఉంది. వేదికలు ఖరారు కాలేదు కానీ.. ఐసీసీ షెడ్యూలు ప్రకారం.. కనీసం రెండు టెస్టులు, మూడు వన్డేలను ఈ రెండు దేశాలు ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఈ మ్యాచ్‌లు జరక్కపోవచ్చునని.. షార్జా వంటి తటస్థ వేదికలపై కూడా పాక్‌తో గేం ఆడడానికి బీసీసీఐ ఒప్పుకోకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: