ఆంధ్రా, తెలంగాణల్లో విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా రామోజీరావు జీవనశైలి అంటే ఆసక్తికరమే. ఎంతో క్రమశిక్షణతో కూడిన దిన చర్య ఆయనది. 80వ పడిలోకి చేరువవుతున్నా.. ఆయనలో ఉత్సాహం ఏమాత్రం తగ్గినట్టు కనిపించదు. నిరంతర శ్రమజీవి ఆయన. మొదటి నుంచి శ్రమ శక్తినే నమ్ముకున్న ఆయనలో ఆధ్యాత్మిక కోణం అంతగా కనిపించదు. 

రామోజీరావు నాస్తికుడని కొందరు చెబుతారు. ఆ వాదనకు బలం చేకూర్చేలా ఆయన ఎప్పుడూ గుళ్లూ గోపురాలూ అంటూ తిరగలేదు. ఈనాడు గ్రూపు సంస్థల వ్యవహారాల్లోనూ ఆయన పూజా వ్యవహారాలకు దూరంగానే ఉంటారు. అలాంటి వ్యక్తి ఇటీవలి కాలంలో మొదటిసారిగా ఓ గుడికి వెళ్లి వస్తూ కనిపించారు.  కటక్ లోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం ప్రకటించిన డాక్టరేట్ పురస్కారం అందుకునేందుకు ఒడిషా వెళ్లిన ఆయన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించారు.

రామోజీ భగవంతుడిని పెద్దగా నమ్మరని.. కానీ.. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడంటే మాత్రం ఎక్కువగా ఇష్టపడతారని అంటారు. రామోజీ పూరీ సందర్శన యాత్ర మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. లేటు వయసులో రామోజీ ఆధ్మాత్మిక బాట పట్టారని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఆయన లేటెస్టుగా ఓం సిటీ నిర్మాణం తలపెట్టిన నేపథ్యంలోనే పూరీ ఆలయాన్ని సందర్శించి ఉండొచ్చని అంటున్నారు. 

రామోజీ సోమవారం కటక్ లో ఉన్న ప్రసిద్ధ పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని సందర్శించుకుని పూజలు కూడా చేశారని కొన్ని పత్రికలు రాశాయి. నుదుట తిలకం మెడలో కండువాతో ఆయన పూజలో పాల్గొన్నారని రాశాయి. ఆ  తర్వాత శ్రీ శ్రీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన సత్సంగ్ సభలో కూడా రామోజీ పాల్గొన్నారు. ఓం సిటీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఇటీవల ఎక్కువగా సాధువులను, బ్రహ్మకుమారీలను కలుస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: