తోక పత్రికలు, తోక పార్టీలు.. ఈ పదాలు అవతలి పక్షాలపై సెటైర్లు వేయడానికి ఈ మధ్య బాగా ఉపయోగపడుతున్నాయి. ఆంధ్రజ్యోతిని వైసీపీ నేతలు తోక పత్రిక అంటూ కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు అదే వైసీపీ వాళ్లు బీజేపీని కూడా తోకపార్టీ అంటూ అసెంబ్లీలోనే విమర్శిస్తున్నారు. ఆంధ్రాలో బీజేపీ టీడీపీతో దోస్తీ కట్టినందువల్ల జాతీయ పార్టీ అయి ఉండి కూడా ఇలాంటి సైటైర్లు భరించవలసి వస్తోంది. 

ఐతే.. అసెంబ్లీలో తమను తోక పార్టీ అని కామెంట్ చేయడం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది.  ఆ పార్టీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు..ఈ కామెంట్లపై బాగా సీరియస్ అయ్యారు. మమ్మల్ని తోక పార్టీ తోక పార్టీ అని కొందరు అంటున్నారు. అలా అనేవారి తోకలు కత్తిరించాలంటే మాకు రెండు గంటల సమయం కూడా పట్టదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విష్ణుకుమార్ రాజు యథాలాపంగా ఆమాట అన్నా.. దాని వెనుక ఎన్నో అర్థాలు ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్ ఎన్నో కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. వాటిలో ఎక్కువగా సీబీఐ  కేసులే ఉన్నాయి. సీబీఐ కేంద్రం చేతిలోనే ఉన్న సంగతి తెలిసిందే. అందుకే జగన్ ఎక్కువగా కేంద్రాన్ని, నరేంద్రమోడీని టార్గెట్ చేయకుండా బండి లాక్కొస్తున్నారు. ఎప్పుడైనా విమర్శించాల్సి వచ్చినా.. సున్నితంగానే తప్ప ఘాటు విమర్శలు తక్కువ. 

ఈ నేపథ్యంలో జగన్ తోక కత్తిరిస్తామని బీజేపీ చెప్పడం ద్వారా పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నట్టే లెక్క. మరి ఈ మాటలు యాధృచ్చికంగా అన్నారా.. వీటి వెనుక ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా అన్నది అంతుబట్టని విషయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: