పట్టిసీమ అంశం అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. పట్టిసీమ ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ధనార్జన కోసమే మొదలుపెట్టారని వైసీపీ విమర్శించింది. పులిచింతల ప్రాజెక్టులతో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. వైకాపా విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ నేతలు ముందు పట్టిసీమపై వైకాపా వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 

పట్టిసీమపై ఓ కచ్చితమైన స్టాండ్ వినిపించడంలో వైసీపీ ఫెయిలైనట్టు కనిపిస్తోంది. పట్టిసీమ పేరుతో సర్కారు భారీ అవినీతికి తెరలేపిందని వైసీపీ ఆరోపించింది. పులిచింతల ప్రాజెక్టును సర్కారు విస్మరించిందని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. 

ఐతే.. పట్టిసీమపై ఆరోపణలు చేసేముందు ఆ ప్రాజెక్టుపై వైకాపా వైఖరి స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. రెండేళ్లలో ప్రాజెక్టుల కోసం 8 వేల కోట్లు ఖర్చు చేసినతీరును వివరించారు. పట్టిసీమలో అవినీతి జరిగిందని నిరూపిస్తే చర్యలు తీసుకుంటామని ప్రతిపక్షానికి సవాల్ విసిరిన ముఖ్యమంత్రి చంద్రబాబు... 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్నికరవు రహిత రాష్ట్రంగా మారుస్తానన్నారు.

పట్టిసీమపై ఓ స్టాండ్ వినిపించడంలో ఫైయిలైన వైసీపీ చివరకు ఓ కామెంట్ చేసింది.. నదుల అనుసంధానానికి వైసీపీ వ్యతిరేకం కాదని.. ఆ పేరుతో సాగుతున్న అవినీతినే ప్రశ్నిస్తున్నామని నెహ్రూ అన్నారు. పట్టిసీమ పనులు పూర్తికాకుండానే.. ఏదో జరిగిపోయినట్టు ప్రభుత్వం ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ ఆరోపించింది. హెడ్‌వర్క్స్ పనులు పూర్తికాకుండానే జాతి ఎలా అంకితం చేస్తారని జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు జిల్లాకో వైఖరి అవలంబిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు..



మరింత సమాచారం తెలుసుకోండి: