తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈసారి ఓపెన్‌ సవాలు విసిరారు. ప్రతిపక్షాలంటే భయమేసి.. ముఖ్యమంత్రి అసలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికే జంకుతున్నాడంటూ ఇదివరలో అడపా దడపా విమర్శలు వినిపిస్తూ ఉండేవి. తక్షణం శాసనసభను సమావేశపరచవలసిన అవసరం ఉన్నదంటూ.. విపక్ష నేతలు డిమాండు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అసెంబ్లీ సెషన్‌ అంటే కేసీఆర్‌ భయపడుతున్నరని ఎద్దేవా చేసిన వారున్నారు. ఇలాంటి వారందరి నోళ్లకు తాళాలు వేస్తూ, విమర్శలకు అడ్డుకట్ట వేస్తూ.. ముఖ్యమంత్రి బహిరంగ ప్రతిపాదన చేశారు. ఈసారి జరగబోయే వర్షాకాల శాసనసభ సమావేశాలు.. ప్రతిపక్షాలు కోరుకున్నన్ని రోజులు జరపడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ మంత్రివర్గ భేటీ అనంతరం ప్రకటించారు. అంటే.. పరిపాలన పరమైన అంశాలు, నిర్ణయాల మీద.. ప్రతిపక్షాల వారు వారికి ఓపిక ఉన్నన్ని రోజులు అసెంబ్లీ వేదికగా పోరాడవచ్చునన్నమాట. 


సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే విషయంలో.. తెలంగాణ ప్రభుత్వం తొలినుంచి ప్రతిసారీ జాగుచేస్తూనే ఉన్నది. ఎప్పుడూ ముందు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగడం, ఆ తరువాత.. తెలంగాణ సమావేశాలు ఇలా అవుతూ వస్తోంది. ఆ షెడ్యూలును ప్రకటించడం, నిర్వహించడంలో ప్రభుత్వం పెద్దగా పట్టింపుతో ఉన్నట్లుగా కనిపించేది కాదు. దీనిని విపక్షాలు విమర్శలకు వాడుకున్నాయి. అలాంటి విమర్శలు చేసేవారికి ఈసారి కేసీఆర్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. 


నిజానికి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు తొలివారంలోనే మొదలు కావాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ భేటీ పూర్తి కాగానే.. వీటిని నిర్వహించాలని గతంలో అనుకున్నారు. అయితే తాజాగా బుధవారం నాటి కేబినెట్‌ భేటీలో కేసీఆర్‌ భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 23వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని ప్రకటించారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటించినప్పుడే.. ఎన్నిరోజులు జరుగుతాయనే సంగతిని కూడా వెల్లడిస్తారు. అయితే ఈ సారి కేసీఆర్‌ ఎన్నిరోజులు అనేది విపక్షాలకే వదలిపెట్టారు. వారు ఎన్ని రోజులు అడిగితే అన్ని రోజులు నిర్వహించడానికి సర్కారు సిద్ధం అని వెల్లడించారు. 


సర్కారు కొన్ని రోజులు నిర్దిష్టంగా సభలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ.. అప్పుడే ముగిసిపోయాయి.. ప్రజా సమస్యల్ని చర్చించడానికి ప్రభుత్వానికి సమయం లేకుండాపోయింది అంటూ విమర్శలు వచ్చేవి. ఈసారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా.. మీకు ఓపిక ఉన్నంత వరకు పోరాడండి అంటూ కేసీఆర్‌ ఛాన్సు ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: