ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన సంస్థల నిర్వహణలో చట్టాలు మారబోతున్నాయి. ప్రెవేటు ఆర్థిక సంస్థలు విచ్చలవిడిగా డబ్బులు ప్రజలనుంచి పెట్టుబడులుగా స్వీకరించడమూ, అధిక లాభాల ఆశచూపించడమూ.. వాటిని తమ ఇష్టారీతిన ఖర్చుచేసి సంస్థకు నష్టాలు చూపించడమూ.. ఏతావతా మదుపు చేసిన సామాన్యులకు చుక్కలు చూపించడమూ జరుగుతోంది. ఇటీవలి కాలంలో తెలుగురాష్ట్రాల్లో వెలుగుచూసిన అగ్రిగోల్డ్‌ కుంభకోణం ఎంత సంచలనం సృష్టిస్తున్నదో అందరికీ తెలుసు. వీరి దెబ్బకు పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా! 


అయితే ఇలాంటి ప్రెవేటు ఆర్థిక సంస్థలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడకుండా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్టాలకు కోరలకు పదును పెట్టనుంది. ప్రధానంగా ప్రెవేటు ఆర్థిక సంస్థలు సాధారణ పౌరుల నుంచి పెట్టుబడులు స్వీకరించడమూ.. ఆ సొమ్మును తమ బినామీలకు రుణాలుగా ఇవ్వడమూ జరుగుతోంది. ఆ తర్వాత.. రుణాలు ఎగవేశారనే నెపం చూపించి.. కంపెనీ మునిగిపోయినట్లుగా రికార్డులు సృష్టిస్తున్నారు. అందుకే ప్రభుత్వం కొత్త చట్టం తేవడానికి సిద్ధమవుతోంది. 


ప్రజలనుంచి డిపాజిట్లు స్వీకరించే ప్రెవేటు సంస్థలు ఇకమీదట నెలనెలా ఆర్థిక వివరాలను స్థానిక కలెక్టర్ల, ఎస్పీల దృష్టికి నివేదించాల్సి ఉంటుంది. సంస్థను ఎంత పెట్టుబడితో ఏర్పాటుచేశారు, డిపాజిట్లు ఎంత వచ్చాయి, ఎవరికి అప్పులిచ్చారు.. అనే వివరాలన్నీ కలెక్టరు ఎస్పీలకు చెబితే.. ఆయా సంస్థలనుంచి అప్పులు తీసుకున్న వారి వివరాలను పోలీసులకు చెబితే.. వారు కూడా నిఘాపెడతారన్నమాట. అవి బినామీలకు ఇచ్చిన అప్పులా, లేదా తీసుకున్న వారు ఎగ్గొట్టి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నదా అనేది కాపెట్టి ఉంటారు. ఆమేరకు ప్రెవేటు సంస్థలు సేకరించిన సొత్తు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వమే కాపలా కాస్తుందన్నమాట. 


ఈ మేరకు కొత్త చట్టాన్ని తేబోతున్నట్లు తెలుస్తున్నది. అయితే.. ఈ నిఘా వ్యవహారాల నిమిత్తం డిపాజిట్లు సేకరించే సంస్థలనుంచి నిర్ణీత రుసుములు వసూలు చేస్తారా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. అలాగే.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. తమకు అనుకూలురైన కొన్ని సంస్థలకు అపరిమిత ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో.. ప్రెవేటు రంగంలోని చిన్న చిన్న ఆర్థికసంస్థలు బలవంతంగా మూత పెట్టుకునేలా.. ఆచరణ సాధ్యం కాని, ఇలాంటి నిబంధనలు తెస్తున్నదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: