జగన్ పార్టీపై దూకుడుగా ఉన్న టీడీపీ నేతలు పనిలో పనిగా సాక్షి పత్రికపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నాయకులు రోజూ అసెంబ్లీలో స్తంభిస్తుండటంపై వారు మండిపడుతున్నారు. ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరో అడుగు ముందుకేశారు. అసెంబ్లీలో వైసీపీ నేతల గొడవకూ.. సాక్షి పత్రికకూ లింకు పెట్టి కొత్త విషయాలు చెప్పారు. వాటిలో నిజమెంత అన్న సంగతి పక్కకు పెడితే ఆరోపణలు చేయడంలో టీడీపీ నాయకుల సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.  

సాక్షి పత్రిక అమ్మకాలు పెంచడం కోసమే వైసీపీ రోజూ సభను స్తంభింపజేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఇటీవల సాక్షి పత్రిక సర్క్యులేషన్ బాగా పడిపోయిందని ఆయన చెబుతున్నారు. ఆ సర్క్యులేషన్ పెంచేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు తంటాలు పడుతున్నారట. అందుకే.. ఆ పేపర్ లో ప్రచురించిన వార్తలను ప్లకార్డులుగా వైసీపీ సభ్యులు వాడుకుంటున్నారట. 

ఆ విధంగా సాక్షి పత్రికకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రచారం కల్పిస్తున్నారని గోరంట్ల అంటున్నారు. ఇంతకీ సాక్షి... దిన పత్రికలు ముద్రించే కార్యాలయమా.. లేక వైకాపా ప్లకార్డులు ముద్రించే కార్యాలయమో అర్థం కావడం లేదని గోరంట్ల సెటైర్ వేశారు. ముందు ముందు సాక్షి పత్రిక ప్ల కార్డుల ముద్రణే పరిమితం కావాల్సి వస్తుందేమో అంటూ జోస్యం చెప్పేశారు. వైఎస్ చిత్రపటం గురించి వైసీపీ సభ్యులు అనవరసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

పనిలోపనిగా ఆయన కేవీపీ రామచంద్రరావుపైనా విమర్శలు గుప్పించారు. వైఎస్ ఫోటో వివాదంపై కేవీపీ ఇటీవల సభాపతికి లేఖ రాశారు. కేవీపీ ప్రజల్లో అపార్థాలు సృష్టించేలా ఉత్తరాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ ఫోటో విషయం గొడవ చేస్తున్న కేవీపీకి.. అప్పట్లో శంషాబాద్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు తొలగింపు సమయంలో న్యాయం గుర్తుకురాలేదా.. అప్పుడు మీరేం చేశారు.. అంటూ నిలదీశారు. కేవీపీ ఆనాడు వైఎస్ అక్రమాలకు వంతపాడారని.. ఇప్పుడు టీఆర్ఎస్ తో అంటకాగుతున్నారని గోరంట్ల మండిపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: