ఔట్ లుక్ మ్యాగజైన్లో వచ్చిన అసభ్య కార్టూన్ వ్యవహారం ఇప్పుడు కేసీఆర్ సర్కారును ఆర్థికంగా ఇబ్బంది పెడుతోంది. ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ కు సర్కారు అండగా నిలవాలని భావించింది. ఔట్ లుక్ పై ఆమె వేసిన కేసును సర్కారు ఖర్చులతో వాదించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. 

ఇప్పటివరకూ రూ. 15 లక్షల రూపాయలు ఈ కేసులో స్మితా సబర్వాల్ కు విడుదల చేశారు. ఈ కేసు స్మితా గెలిస్తే సొమ్ము తిరిగి ఇవ్వాలని, లేకుంటే ఇవ్వనక్కర్లేదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఉత్తర్వు వివాదాస్పదం అవుతోంది. వ్యక్తిగత విషయాలకు ప్రజాధనం ఖర్చు పెట్టడం సరికాదంటూ కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. 

ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మొదట రచయిత వత్సల విద్యాసాగర్ హైకోర్టులో పిల్ వేశారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తి కె. ఈశ్వరరావు పిల్ వేశారు. స్మితాసబర్వాల్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న విషయం ప్రస్తావిస్తూ ఔట్ లుక్ మ్యాగజైన్ కార్టూన్ వేసిందని.. అది స్మిత వ్యక్తిగత వ్యవహారమని పిటిషనర్ వాదిస్తున్నారు. ప్రైవేటు వ్యవహారాలకు ప్రజాధనం ఎలా ఖర్చుచేస్తారని ప్రశ్నిస్తున్నారు. 

తంలో ఓ కేసులో సుప్రీంకోర్టు... వ్యక్తిగత కేసుల కోసం ప్రజాధనం ఖర్చు చేయకూడదని చెప్పిందని పిటిషనర్ కోర్టుకు గుర్తు చేశారు. కామన్ కాజ్ కేసును ఉదాహరణగా చూపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉపసంహరింపజేయాలని కోర్టును అర్థించారు. ఈ విషయంలో విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఏం చేస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: