ఓటుకు నోటు వ్యవహారం శుక్రవారం నాడు ఆంధ్రప్రదేవ్‌ అసెంబ్లీ ని ఒక్క కుదుపు కుదిపేసింది. నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాకపోయినప్పటికీ.. సభ మొత్తం ఈ రగడతో అల్లకల్లోలంగా మారింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వం తమ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసిన కుట్ర గురించి.. ఈ సభలో ఎలా ప్రస్తావిస్తారంటూ.. తెలుగుదేశం నాయకులు చాలా పెద్ద హంగామా సృష్టించారు. ఈ అంశం మీద చర్చ జరగాల్సిందేనంటూ... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభలో వాయిదా తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. అయితే దానిని స్పీకరు తిరస్కరించడం కూడా వివాదానికి కారణమైంది. మొత్తానికి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు చివరిరోజైన శుక్రవారం నాడు ప్రారంభ సమయం.. అచ్చంగా ఓటుకునోటు వ్యవహారంలో మంటగలిసిపోయింది. 


నిజానికి ఓటుకునోటు కేసు గురించి ఈ సభలో చర్చించడానికి వీల్లేదంటూ.. అది మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కానే కాదంటూ.. తెలుగుదేశం నాయకులు.. బుకాయించడానికి చాలా పెద్ద ప్రయత్నమేచేశారు. సభలో పాలకపక్షం వాదనను వినిపించడంలో ప్రముఖంగా ఉండే అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు లాంటి వాళ్లు.. అసలిది చర్చకు యోగ్యమైన అంశమే కాదన్నట్లుగా డబాయించారు. 


అయితే సాక్షాత్తూ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు, ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ సమర్పించిన చార్జిషీటులో 22 సార్లు ప్రస్తావింపబడి ఉన్న సమయంలో.. దాన్ని 'మనకు సంబంధించిన విషయం కాదు' అని ఎలా అనగలరో అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక మది తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ ఓటుకునోటు కేసుతో సంబంధం ఉన్నట్లుగా వార్తలూ వచ్చాయి. పలువురు విచారణను కూడా ఎదుర్కొన్నారు. సీఎం చంద్రబాబు.. స్వయంగా ఈ అవినీతి బాగోతాన్ని తెరవెనుకనుంచి నడిపించాడనే ఆరోపణలకు కేంద్రమైన ఫోను సంభాషణలు కూడా వెలుగుచూడడం, ఆ ఫోనులోని స్వరం సాక్షాత్తూ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ వారు కూడా తేల్చిచెప్పడం అందరికీ తెలిసిందే. మరి ఇన్ని జరుగుతున్నా సరే.. ప్రతిపక్షం ఆ అంశాన్ని డిమాండ్‌ చేసినప్పుడు చర్చ జరగడానికే ఒప్పుకోకుండా.. దానికి సంబంధం లేదనే తమ వాదనను మాత్రం సభలో వినిపిస్తూ.. తెలుగుదేశం డాబుసరిగా బుకాయించి తప్పించుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: