ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనేది అభివృద్ధి ఫలాలను రుచిచూడాలంటే.. పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం దిశగా దృష్టి సారించాలంటే.. ప్రత్యేకహోదా అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరం అవుతుందనేది అందరికీ తెలుసు. అయితే ఒకవైపు విపక్షాలు దీనికోసం గట్టిగా పట్టుపడుతూ ఉండగా.. పాలక పక్షం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తాజాగా చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా.. ప్రత్యేకహోదా కోసం శాంతి మార్గంలోనే మన ప్రయత్నం మనం చేయాలనే మాట చెప్పడం, ఆయన చిత్తశుద్ధి గురించి పలువురిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. 


చంద్రబాబునాయుడు.. కేంద్రప్రభుత్వంలో భాగస్వామి పార్టీకి అధినేత అయినప్పటికీ.. కేంద్రం వద్ద తన రాష్ట్రానికి సంబంధించి.. డిమాండ్‌ చేసే అధికారాన్ని హక్కులను చాలా వరకు కోల్పోయినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో అత్తెసరు మెజారిటీతో కాకుండా.. పూర్తి మెజారిటీతో భాజపా సర్కారు (ఎన్డీయే సర్కారు రూపంలో) ఏర్పడడం ఒక పెద్ద మెలిక. అది చంద్రబాబుకు తొలిదెబ్బ. తన మంత్రాంగం వల్ల కేంద్రంలో మోడీ గద్దె ఎక్కే పరిస్థితి రావాలని ఆయన ఎన్నికల ముందు కోరుకుని ఉండొచ్చు. అలా జరగలేదు. 


ఆ తర్వాతి సమీకరణాల్లో.. తన పార్టీకి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇప్పించుకునేసరికే.. కేంద్రం వద్ద చంద్రబాబు 'అడిగే' అధికారం పలచబడిపోయింది. ఆతర్వాత ఓటుకు నోటు ఒక పెద్ద దెబ్బ. దాంతో ఉన్న పరువు కూడా పలచబడిపోయింది. ఇక ఏమొహం పెట్టుకుని.. కేంద్రాన్ని డిమాండ్‌ చేయగలం అని ఆయనే సంకోచించే పరిస్థితి. అలాంటి సమయంలో చంద్రబాబునాయుడు ఇప్పుడు... శాంతి మార్గం అనుసరించాలని అంటున్నారు. పోనీ.. ఎన్నాళ్ల వరకు శాంతి మార్గంలో ప్రయత్నించాలో ఒక డెడ్‌లైన్‌ విధించి చెప్పగల తెగువ చంద్రబాబునాయుడుకు ఉన్నదా అనేది జనం సందేహం. ఒకవైపు వైకాపా పోరాడితే తప్ప ప్రత్యేకహోదా రాదంటూ.. ఉద్యమబాటను అనుసరించమని పిలుపు ఇస్తున్నది. అటు కేంద్రం లో వాతావరణంచూస్తే.. అసలు ఎప్పటికీ హోదా రాదనిపిస్తోంది. ఇటు చంద్రబాబు.. శాంతి మార్గం.. అంటున్నారు. మరి ఎప్పటిదాకా శాంతిగా నిరీక్షించాలనే సంగతి కూడా ఆయన చెప్పాలి కదా! శాంతి మార్గంలో మోడీ ప్రభుత్వం దిగిపోయే దాకా ఎదురుచూసి.. ఆ తర్వాత కాంగ్రెస్‌ వస్తే.. హామీ ఇచ్చింది మీరే కదా.. హోదా ఇవ్వండి అంటూ పోరాడాలి అనేది చంద్రబాబు ప్లాన్‌ లాగా కనిపిస్తోంది. ఇలాంటి డొంకతిరుగుడు మాటలతో ప్రజల్ని బురిడీ కొట్టించడం తగదని ఆయన తెలుసుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: