''బహుశా దేశంలో ఎక్కడా ఇలా ఎన్నడూ జరిగి ఉండదేమో? ఒక ముఖ్యమంత్రి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం అనేది బహుశా ఇదే ప్రథమం కావొచ్చు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే.. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, లంచాలు తీసుకుని సంపాదించిన చంద్రబాబు సొమ్మును తీసుకెళ్లి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటును కొనుగోలుచేసేందుకు వెళ్లి దొరికిపోయిన సంగతి అందరికీ తెలుసు. ఇంత ఘోరంగా డబ్బు ఇస్తూ దొరికిపోతే.. సీఎం మీద డైరక్టుగా ఆరోపణలు వస్తే.. ఆ అంశం మీద అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వకపోవడం అనేది కూడా బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటి సారి అవుతుందేమో..'' అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహనరెడ్డి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. 


శుక్రవారం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత.. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టిన జగన్‌.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కనీసం చర్చకు కూడా అవకాశం ఇవ్వకపోవడాన్ని అప్రజాస్వామికంగా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం.. దొంగతనం చేస్తూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన దొంగ కూడా.. తాను చేస్తున్న పని తప్పు కాదు కానీ.. తనను ప్రశ్నించడమే తప్పు అంటూ రివర్సులో వాదించినట్లుగా ఉన్నదని జగన్‌ ఆరోపించారు. ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తెదేపా ఎమ్మెల్యే తీసుకువెళ్లిన డబ్బు .. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అవినీతితో సంపాదిస్తున్న, అనౌకౌంటెడ్‌ సొమ్మేనని కూడా ఆయన ఆరోపించారు. 


అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులైనా జరపాలని తాము ప్రభుత్వాన్ని కోరామని కానీ పట్టించుకోలేదని , ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండగా.. వాటి గురించి చర్చ జరిగే అవకాశమే లేకుండాపోయిందని జగన్‌ ఆవేన వ్యక్తం చేశారు. కేవలం అయిదే రోజులు నిర్వహించడం చాలా అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. ఓటుకునోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉన్నదని.. స్పష్టంగా తేలుతుండగా.. అసెంబ్లీలో తనగదిలోనుంచి బయటకు రాకుండా కూర్చుండిపోయిన చంద్రబాబు రాజీనామాచేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. సభకు వచ్చి చర్చను ప్రారంభించి వెళ్లవలసిన ముఖ్యమంత్రి.. మొహం చాటేయడం తప్పు అని ఆయన చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: