ఎన్నికల సమయానికి ఏదో ఒక విధంగా.. అరచేతిలో అద్భుతాలను చూపించేస్తే.. వచ్చే సారికి కూడా.. అధికార పగ్గాలు ప్రజలు తన చేతిలో పెట్టేస్తారనేది చంద్రబాబునాయుడు ప్రధానమైన విశ్వాసంగా కనిపిస్తున్నది. ఈ విడత అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. రాజధాని అమరావతి అనే పాట తప్ప మరొక అంశమే తన పరిధిలోకి రాదన్నట్లుగా మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు.. విజయవాడ మెట్రో గురించి కూడా బాగానే శ్రద్ధ పెడుతున్నారు. హైదరాబాదులో ఎన్నడో సంకల్పించిన మెట్రో పనులే ఇప్పటికీ పూర్తి కాకుండా, మెట్రో పరుగులు ఇంకా మొదలు కాకుండా ఉన్న తరుణంలో నేటికి సరిగ్గా మూడు సంవత్సరాల కాలవ్యవధిలో ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడలో మెట్రో పరుగుల గురించి డెడ్‌లైన్‌ విధించడం ఆశ్చర్యంగానే కనిపిస్తోంది. 


మెట్రో రైల్వే నిపుణుడు శ్రీధరన్‌తో శుక్రవారం నాడు జరిపిన భేటీలో చంద్రబాబునాయుడు ఈమేరకు ఆయనకు డెడ్‌లైన్‌ విధించేశారు. నిజానికి శ్రీధరన్‌ ఢిల్లీ మెట్రో వ్యవస్థను రూపుదిద్దడం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయన నిర్దేశకత్వంలోనే.. హైదరాబాదు మెట్రో పనులను కూడా ప్రారంభించారు. షెడ్యూలు ప్రకారం అయితే.. ఈ ఏడాది ఉగాది నాటికే హైదరాబాదులో తొలి మెట్రో రైలు పరుగులు తీయాల్సి ఉంది. అయితే.. గత ఏడాదిగా పనుల నిర్వహణలో జాప్యం జరుగుతూ రావడం వల్ల ఇప్పటిదాకా రైలు పరుగులు ప్రారంభించలేదు. అయితే చంద్రబాబునాయుడు విజయవాడ మెట్రో రైలు మాత్రం 2018 ఆగస్టు నాటికి పరుగులు పెట్టాలని చెబుతున్నారు.


ఇదిలా ఉండగా.. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఏపీలో మెట్రో పరుగుల గురించి మాత్రం చంద్రబాబునాయుడు అప్పుడే.. డెడ్‌లైన్‌లు సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి 2019 ఎన్నికలు వచ్చేలోగా.. ఏపీలో తాను ఏదో ఒకటి కొత్తగా సాధించినట్లుగా చూపించుకోవాలనే తపన... చంద్రబాబునాయుడు ప్రయత్నాల్లో పుష్కలంగా కనిపిస్తున్నది. ఒకవైపు రాజధాని నిర్మాణానికి నిధుల్లేవు.. ఇంటికొక ఇటుక విరాళం ఇవ్వండి అంటున్న చంద్రబాబు.. అదే సమయంలో మెట్రో రైలు వ్యవస్థకు మాత్రం నిధుల కొరత లేదని, పుష్కలంగా ఉన్నాయని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పూర్తిచేసేయాల్సిందేనని ఆయన అంటున్నారు. జపాన్‌కు చెందిన జైకా సంస్థ ఆర్థిక సహాయం అందిస్తున్నందున విజయవాడ మెట్రోకు ఇబ్బందుల్లేవని చెబుతున్నారు. 


సాధారణంగా నిపుణుల అంచనాల ప్రకారం.. మన దేశంలో ఉన్న సామాజిక వ్యవస్థ ప్రకారం.. లాభాల బాటలో నడుస్తున్న మెట్రో అంటూ ఒక్కటి కూడా లేదు. మరి జైకా సంస్థ ఈ లాభనష్టాల లెక్కలు కూడా సరిచూసుకున్న తర్వాత.. విజయవాడ మెట్రోలో ఎంత లాభాలు వస్తాయో.. పెట్టుబడులు మురిగిపోతాయో.. నిగ్గు తేల్చుకున్న తర్వాత.. వెనక్కు తగ్గితే పరిస్థితి ఏంటి? అనే సందేహం కూడా కొందరిలో కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: