ఎమ్మెల్యేలు అంటే.. ఒక శాసనసభ నియోజకవర్గంలోని ప్రజలకు ప్రతినిధిగా తామొక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులం అనే సంగతిని వారు విస్మరించారు. స్వల్పకాలిక ఆవేశకావేశాలకు లోనై పరస్పరం కొట్టేసుకున్నారు. సభలో ఇరు పార్టీలకు చెందిన నాయకుల మధ్య మొదలైన వాదులాట.. నెమ్మది నెమ్మదిగా చిలికి చిలికి గాలివానగా మారి.. కొట్లాటగా మారింది. సాక్షాత్తూ మంత్రుల సహా అందరూ వాదులాడుకుంటూ ఉండగానే.. మాటామాటా అనుకుంటూ వచ్చిన ఎమ్మెల్యేలు హఠాత్తుగా ఒకరినొకరు కొట్టేసుకున్నారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ సమావేశంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిషత్‌ సమావేశంలో సభ్యులతో పాటు తెరాస, కాంగ్రెస్‌, తెదేపా లకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి అందరూ హాజరుగా సమావేశంలోనే ఉన్నారు. జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చజరగాల్సిన చోట.. వివాదాలు మొదలయ్యాయి. ఈ వివాదాలు ఒక పట్టాన కొలిక్కి రాలేదు. లంచ్‌బ్రేక్‌ తర్వాత కూడా.. సభాపర్వంలో.. తగాదాలే కొనసాగుతూ వచ్చాయి. అయితే తెరాసకు చెందిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూండగా.. తన వాదన వినిపించడానికి ఎమ్మెల్యే బాలరాజు జడ్పీ ఛైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. అదే సమయంలో.. ఇరు పార్టీలకు చెందిన నాయకులందరూ అక్కడికి చేరుకున్నారు. 


ఒకే అంశం మీద ఉదయంనుంచి చర్చ జరుగుతుండగా.. దాన్ని పక్కన పెట్టి.. ప్రజాసమస్యల మీద చర్చించాలని పోడియం వద్దకు రామ్మోహన్‌రెడ్డి వెళ్లినప్పుడు పరిస్థితి ముదిరింది. గువ్వల బాలరాజు కూడా పోడియం వద్దకు దూఉకురావడం... నాయకులందరూ గుమికూడిన నేపథ్యంలో.. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే కరవుజిల్లా చేయాలంటూ తను మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడి తన మీద దాడిచేసి కొట్టారని గువ్వల బాలరాజు అంటున్నారు. దానికి స్పందనగా ఆయన కూడా రామ్మోహనరెడ్డి మీద చేయిచేసుకోవడం టీవీ ఛానళ్లలో స్పష్టంగా వచ్చింది. మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం కొట్టుకోవడం జరిగింది. 


ఎమ్మెల్యేలు మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని, తమ స్థాయి హోదాలను మరచి ఈ వివాదాలకు దిగుతున్నారని.. రకరకాల నెపాలు పెట్టుకుంటూ.. ఇలా కొట్లాటలకు దిగడం ఏమాత్రం సమంజసం కాదని ప్రజలు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: