రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని విమర్శించడానికి నేతలకు పెద్దగా కారణాలు అక్కర్లేదు. తాము ఎదుటి వారిని ఎత్తిపొడవడానికి ఓ సందర్భం దొరికితే చాలు కారణం అక్కర్లేదు. ఇప్పుడు ఏపీలోని తెలుగుదేశం నాయకులు వైఖరి చూసినా కూడా అలాగే అనిపిస్తోంది. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒక కొలిక్కి వచ్చాయి. మధ్యాహ్నానికి శాసనసభ, ఆ తర్వాత కొన్ని గంటలకు మండలి నిరవధికంగా వాయిదాపడ్డాయి. అయిదురోజులుగా అధికార విపక్షాలకు చెందిన సభ్యులంతా అడ్డగోలుగా ఒకరినొకరు విమర్శించుకున్న పర్వానికి తెరపడింది. సభలోని తరహాలోనే ఆ తర్వాత కూడా.. అర్థంలేని విమర్శలే వినిపిస్తూ ఉండడం జరుగుతోంది. 


ఎలాగంటే... రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం గురించి ప్రజలందర్నీ సమీకరించి తిరుగులేని పోరాటం చేయాలని కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవాలని జగన్మోహనరెడ్డి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని శాసనసభలో చర్చకు తెచ్చినప్పుడు.. దాన్ని పలచన చేయడానికి విభజనచట్టంలోని ఇంకా అనేక అంశాలు తీర్చాలంటూ.. ఒక మొక్కుబడి తీర్మానం చేశారు. ఓటుకునోటులో పట్టుబడిన తర్వాత.. తెదేపా ప్రధానంగా ప్రస్తావిస్తున్న సెక్షన్‌ 8ను కూడా అందులో చేర్చారు. ఆరోజు చర్చలోనే వైకాపా సెక్షన్‌ 8 గురించి మాట్లాడ్డం లేదంటూ తెదేపా ఎదురుప్రశ్నించింది. తాజాగా శుక్రవారం నాడు కూడా తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అదే విషయం అంటున్నారు. సెక్షన్‌ 8 గురిచి జగన్‌ ఎందుకు మాట్లాడడం లేదంటూ నిలదీస్తున్నారు. 


ఇప్పుడు లోగుట్టును పరిశీలిస్తే.. సెక్షన్‌ 8 గురించి అసలు జగన్‌ ఎందుకు ప్రశ్నించాలి? నిజానికి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో ఇక్కడ నివాసంఉండే ఆంధ్రులకు శాంతిభద్రతల పరంగా ఇబ్బందులు వస్తే.. గవర్నరు జోక్యానికి సంబంధించిన సెక్షన్‌ అది. ఇక్కడి ఆంధ్రులు తమకు అలాంటి సమస్య ఉన్నట్లు ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు. ఎవరికీ విన్నవించలేదు. కాకపోతే.. ఓటుకునోటులో దోషులుగా దొరికిపోయిన తర్వాత.. తమ ను తాము కాపాడుకోవడానికి తెదేపా ఆ పాట అందుకుంది. పదేపదే దాన్నే పాడుతున్నది. తెలుగుదేశం వాళ్ల తప్పులకు దాన్ని కవచంలాగా వాడుకోవాలని చూస్తున్నది. హైదరాబాదు నగరంలో సామాన్యుడైన ఆంధ్రప్రాంతం వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు, తెలుగుదేశం వాళ్లు దుర్వినియోగం చేస్తున్నప్పుడు.. వారిని కాపాడడానికి జగన్‌ కూడా ఉద్యమించాలని కోరుతున్నట్లుగా ధూళిపాళ నరేంద్ర మాటలు కనిపిస్తున్నాయి. ఇది తెదేపా వారి అత్యాశలాగా ఉన్నదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: