భారతదేశపు అణుశక్తి అద్భుతాల శాస్త్రవేత్త, మానవతా మూర్తి, మహనీయుడైన నాయకుడిగా, ఆదర్శనీయుడిగా పేరున్న మనీషి అబ్దుల్‌ కలాంకు ఒదిషా ప్రభుత్వం ఘనమైన నివాళి అర్పించింది. ఆయనకు నివాళి అర్పించడానికి.. తమ తమ రాష్ట్రాల్లో కూడా కలాం తాలూకు అస్తిత్వాన్ని పదిలంగా భద్రపరచుకోవడానికి దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అబ్దుల్‌ కలాం సాగించిన పరిశోధనల ప్రస్థానంలో కీలకమైన భాగస్వామ్యం కలిగి ఉన్న వీలర్‌ ఐలాండ్‌ కు ఒదిషా ప్రభుత్వం ఆయన పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. 


వీలర్‌ ఐలాండ్‌ అనేది ఒదిషా పరిధిలోకి వచ్చే ఒక దీవి. దీనికి అప్పట్లో బ్రిటిష్‌ అధికారి పేరిట వీలర్‌ దీవి అని పేరు పెట్టారు. అయితే ఇది భౌగోళికంగా చాలా అనువుగా ఉండడంతో.. అబ్దుల్‌ కలాం సుదీర్ఘ అధ్యయనం అనంతరం.. దీనిని తన క్షిపణి ప్రయోగాలకు వేదికగా ఎంచుకున్నారు. ఈ చిన్న దీవితో ఆయనకు అనితరమైన అనుబంధం ఉంది. కలాం పరిశోధనల హయాంలో భారత క్షిపణి ప్రయోగాలకు వేదికగా వీలర్‌ ఐలాండ్‌ ఎంతో పేరుమోసింది. దీన్ని గుర్తించింది.. ఈ ద్వీపం అభివృద్ధి చెందడానికి తన వంతు కృషిచేసింది.. అంతా అబ్దుల్‌ కలాం మాత్రమే. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఒదిషా ప్రభుత్వం వీలర్‌ అనే బ్రిటిష్‌ పేరును తొలగించి ''కలాం దీవి''గా దీనికి నామకరణం చేసింది. 


కలాం మరణించిన సందర్భంలో ప్రతిరాష్ట్రమూ తమకు తోచిన రీతిలో ఆయనకు నివాళి అర్పించే ప్రయత్నాలు చేశాయి. తెలంగాణ సీఎం.. హైదరాబాదులోని కలాం తొలి ఉద్యోగం చేసిన డీఆర్‌డీఎల్‌ సంస్థకు కలాం పేరుపెట్టాలని కేంద్రానికి లేఖ రాయగా, ఏపీ సర్కారు ఒంగోలు వద్ద వచ్చే ఐఐటీకి ఆయన పేరు పెట్టింది. అలా ప్రతిరాష్ట్రమూ ఓ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలోనే.. వీలర్‌ ఐలాండ్‌కు ఆయన పేరుపెట్టాలనే ప్రతిపాదన కూడా ప్రముఖంగా వినిపించింది. ఇన్నాళ్లకు దానిని కార్యరూపంలోకి తీసుకురావడం ద్వారా.. ఒదిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, అబ్దుల్‌ కలాంకు ఘనమైన నివాళి అర్పించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: