ఉమ్మడి తెలుగురాష్ట్రం ఉండగా.. రాష్ట్ర ప్రజలందరికీ కలిపి సేవలందించడానికి ఏర్పాటు చేసిన రెండు విశ్వవిద్యాలయాల విషయంలో రేగిన రగడ శుక్రవారం నాడు తాత్కాలికంగా ఒక కొలిక్కి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉంటూ ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వ ఆస్తిగా మారిపోయిన అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ , తెలుగు విశ్వవిద్యాలయాల్లో.. ఏపీ కి చెందిన విద్యార్థులకు కనీసం ఎడ్మిషన్లు కూడా లేకుండాపోయిన నేపథ్యంలో.. ఆ ప్రాంత విద్యార్థులకు ఏర్పడిన విషమ సమస్యను కోర్టు ఒక కొలిక్కి తెచ్చింది. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు విద్యార్థుల ఇక్కట్ల గురించి నామమాత్రంగా కూడా పట్టించుకోకపోయినా.. కోర్టు మాత్రం.. వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. 


విభజన చట్టంలో పదో సెక్షన్‌ను చూపించి.. అంబేద్కర్‌, తెలుగు యూనివర్సిటీలు తమవే అని చెప్పుకున్న తెలంగాణ సర్కారు ఏపీ లో ఎడ్మిషన్లు నిలిపేసింది. తెలంగాణ ప్రాంతంలోడిగ్రీ ఎడ్మిషన్లు కూడా పూర్తయిపోయాయి. దీని మీద విద్యార్థులు ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నా ఏపీ సర్కారులో చలనం రాలేదు. గవర్నరు ఎడ్మిషన్లు ఇవ్వాల్సిందే అంటూ ఆదేశించినా యూనివర్సిటీ పట్టించుకోలేదు. దాంతో విద్యార్థులంతా.. తమను ఆదుకోవాలంటూ.. పెద్ద సంఖ్యలో ఏకంగా హైకోర్టుకు లేఖలు రాసుకున్నారు. వందల సంఖ్యలో వచ్చిన లేఖల ఆధారంగా సూమోటో గా కేసు నమోదుచేసిన హైకోర్టు విచారణ జరిపింది. 


ఈలోగా.. ఏపీలో స్టడీ సెంటర్లను కూడా మూసేయడానికి యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఈవ్యవహారాలను విచారించిన హైకోర్టు.. ఉభయ ప్రభుత్వాల న్యాయవాదులను పిలిపించి.. ప్రస్తుతానికి ఈ విద్యా సంవత్సరంలో ఏపీ వారికి కూడా ఎడ్మిషన్లు ఇవ్వాల్సిందే అంటూ తీర్పు చెప్పింది. అదేసమయంలో ఏపీలోని స్టడీ సెంటర్ల నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం అక్కడి ఏపీ ప్రభుత్వమే భరించాలని, దానిని తెలంగాణపై మోపడానికి వీల్లేదని తీర్పు చెప్పింది. 


డిగ్రీ చదవాలనే తమ ఆశలు, డిగ్రీ మధ్యలో ఆగిపోతుందనే తమ భయాల పట్ల ఏపీలోని చంద్రబాబు సర్కారు సకాలంలో స్పందించకపోయినప్పటికీ.. హైకోర్టు న్యాయం చేసిందంటూ.. అక్కడి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: