ఆయన కొమ్ములు తిరిగిన రాజకీయ దురంధరుడు కావొచ్చు గాక.. అనేకానేక అంతర్జాతీయ వేదికల మీద.. సభికులను మంత్రముగ్ధుల్ని చేసి.. నోరు మెదపనివ్వకుండా అద్భుత ప్రసంగాలు చేసిన అనుభవం ఆయనకు అనల్పంగా ఉండవచ్చు గాక.. అయినా సరే ఆయన ఓ పసివాడు అడిగిన ప్రశ్నకు కంగారు పడిపోయారు. వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు లోకువ అన్న సామెత శుక్రవారం నాడు ప్రధాని మోడీ విషయంలో నిజంగా మారింది. తాను తలచింది ఒకటి.. అక్కడ జరిగింది మరొకటి. నిజానికి ప్రసంగం కోసం తాను ప్రిపేర్‌ అయి వచ్చింది ఒకటి , అక్కడినుంచి జాతికి అందించిన సందేశం మరొకటి...! ఇలాంటి చిత్రమైన అనుభవం ప్రధాని మోడీకి కలిగింది. 


ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోడీ ఢిల్లీలోనే పిల్లల్తో ఒక సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఇలాంటి సమావేశాలను ప్లాన్‌ చేసుకున్నప్పుడు.. దేశానికి మొత్తంగా స్ఫూర్తి దాయకంగా కనిపించే ఉపన్యాసాలతో రంజింపజేయడం మోడీకి అలవాటు. ఆ అలవాటు ప్రకారమే డిజిటల్‌ ఇండియా అనే మంత్ర జపం చేస్తూ పిల్లల ముందు మాటలు ప్రారంభించారు. అంతలో ఓ స్కూలు కుర్రాడు లేచి.. ఈదేశంలో సగం ప్రాంతాల్లో ఇప్పటికీ కరెంటు లేదే.. ఇక డిజిటల్‌ ఇండియా ఎలా సాధ్యం అని ప్రశ్నించడంతో కంగారు పడడం మోడీ వంతయింది. ఆయన ప్రసంగం ఏం ప్రిపేర్‌ అయి వచ్చారో గానీ.. ఆ పిల్లాడి పుణ్యమాని ఈ దేశానికి విద్యుత్తు సదుపాయం గురించి డెడ్‌లైన్‌ సహా కొత్త హామీలు ఇవ్వాల్సి వచ్చింది. 


పిల్లవాడు సూటిగా అలా ప్రశ్నించే సరికి తొలుత మాటలు తడుముకున్న మోడీ.. తర్వాత విద్యుత్తు సమస్య గురించి తన అవగాహన ప్రదర్శించారు. ఈ దేశంలో వెయ్యి రోజుల్లో ప్రతిగ్రామీనిక కరెంటు ఇచ్చేస్తాం అంటూ కొత్త హామీ గుప్పించారు. నిజానికి ఇది ఆయన ఇప్పట్లో ఇవ్వదలచుకోని హామీ అయి ఉండవచ్చు. కానీ పిల్లాడి ప్రశ్న కలిగించిన కంగారును కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇంత భారీ హామీ ఇవ్వాల్సి వచ్చింది మరి!!


మరింత సమాచారం తెలుసుకోండి: