అసెంబ్లీ సమావేశాల చివరి రోజు... జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను ఓ ఆటాడుకున్నారు. ఓటుకు నోటు కేసు అంశాన్ని వ్యూహాత్మకంగా సభలో తీసుకొచ్చి అధికార పక్షాన్ని బాగా ఇరకాటంలో పడేశారు.. అవినీతి విషయం ప్రస్తావనకు వచ్చే సరికి ఎప్పుడూ డిఫెన్సులో పడిపోయే జగన్.. ఈ సారి మాత్రం అఫెన్సుకు వచ్చేశారు. జగనేంటి.. అవినీతి గురించి మాట్లాడటమేంటి.. అంటూ టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నా.. జగన్ మాత్రం సీరియస్ గానే తన పాత్ర విజయవంతంగా పోషించారు. 

చివరి రోజు టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ మంచి వ్యూహమే రచించారు. సాధారణంగా ఇలాంటి అంశాలను వాయిదా తీర్మానం ద్వారా ప్రస్తావిస్తారు. వాటిని స్పీకర్ తిరస్కరించడం ఆనవాయతీ.. ఈ నోటుకు ఓటు విషయంలోనూ అదే జరిగింది. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన జగన్ ఇదే అంశాన్ని 344 సెక్షన్ కిందా తీసుకొచ్చారు. అయినప్పటికీ సభాపతి.. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందంటూ కామెంట్ చేయడం ద్వారా ఆయన పక్షపాతం చూపుతున్నారన్న అభిప్రాయం కలిగింది. 

నోటుకు ఓటు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి చర్చించకూడదు.. మరి నా కేసులు కూడా కోర్టు పరిధిలోనే ఉన్నాయి కదా.. వాటిపై మాత్రం రోజూ ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారెందుకు అని జగన్ నిలదీశారు. వ్యూహాత్మకంగా తప్పులు చేస్తూ.. జగన్ కు మేలు చేస్తున్న అచ్చెన్నాయుడు చివరి రోజు కూడా అదే పని చేశారు. కేసీఆర్ రాత్రి జగన్ కు ఫోన్ చేసి ఏంటి ఓటుకు నోటు అంశం అసెంబ్లీలో మాట్లాడతానన్నావు మాట్లాడవేంటి.. అని అడిగారు.. అందుకే జగన్ ఈ ప్రస్తావన తెస్తున్నాడని విమర్శించారు. 

దీంతో జగన్ రెచ్చిపోయారు.. కేసీఆర్ నాకు ఫోన్ చేసినట్టు రుజువు చేస్తే రాజీనామా చేస్తా... రుజువు చేయకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని నిలదీశారు. దీనికి టీడీపీ దగ్గర సమాధానం లేకపోయింది. ముఖ్యమంత్రి పేరు 22 సార్లు చార్జ్ షీట్లో ఉంటే.. వీడియోల్లో దొరికిపోతే.. ఎందుకు అసెంబ్లీలో చర్చించకూడదు అన్న జగన్ ను టీడీపీ దీటుగా ఎదుర్కోలేకపోయింది. ఎదురుదాడి చేయడమే తప్ప.. నోటు కు ఓటు కేసుతో చంద్రబాబు పాత్ర లేదని ఏ ఒక్క టీడీపీ నేతా గట్టిగా వాదించలేకపోయారు. చంద్రబాబును అపఖ్యాతి చేయాలన్న జగన్ కోరిక చివరి రోజు సంపూర్ణంగా నెరవేరింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: