జాతీయ రాజకీయాల విషయాలను ఒకసారి గమనిస్తే.. ప్రస్తుత పరిణామాలు ఒకరికి మాత్రం తెగ సంతోషాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. ఆ ఒక్కరూ మరెవ్వరో కాదు.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈ దేశానికి కాబోయే ప్రధాని అనే డిజిగ్నేషన్‌ను కొన్ని దశాబ్దాలుగా కలిగి ఉన్న రాహుల్‌ గాంధీ. అవును మరి.. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు.. ఆయనకు మహదానందం కలిగిస్తుండవచ్చు. మోడీ సర్కారు ఒక్క అడుగు వెనక్కు వేసినా.. చాలు, తనకు వెయ్యి ఏనుగుల బలం వస్తుందని ఆయన మురిసిపోతుండవచ్చు. అవును- భూసేకరణ బిల్లు విషయంలో మోడీ సర్కారు తమ నిర్ణయాలను సవరించుకునే దిశగా వెళ్తుండడం కాంగ్రెస్‌ పార్టీకి అనల్పమైన బలాన్ని కలిగిస్తోంది. ఒక్కకాంగ్రెస్‌ మాత్రమే కాకుండా, విపక్షాలన్నీ కూడా.. సుదీర్ఘమైన పోరాటం జరిపిన నేపథ్యంలో.. భూసేకరణ బిల్లుపై మోడీ సర్కార్‌ వెనక్కు తగ్గని పరిస్థితి ఏర్పడింది. అందులో కొన్ని మార్పు చేర్పులు చేయడానికి సర్కార్‌ సిద్ధపడింది. 


కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఈ పరిణామాన్ని తమ పార్టీ సాధించిన విజయంగా ప్రచారం చేసుకోవడానికి ఉద్యుక్తమవుతున్నది. అయితే వ్యూహాత్మకంగా, భూసేకరణ బిల్లుపై ప్రభుత్వం వెనక్కు తగ్గడాన్ని ప్రజల విజయంగా అభివర్ణిస్తూ.. ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడానికి వారు సిద్ధమవుతున్నారు. విపక్షాలు అందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా.. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సాగించిన పోరాటాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. అదే విధంగా.. రాహుల్‌ గాంధీ దీనికి వ్యతిరేకంగా పడిన శ్రమను కూడా తక్కువకట్టి చూడలేం. ఆయన దేశంలోని అనేక రాష్ట్రాల్లో కేవలం ఈ భూసేకరణ బిల్లు మీద స్వయంగా పాదయాత్రలు నిర్వహించారు. అన్నీ కలిపి కొన్ని వందల కిలోమీటర్ల పాదయాత్రలు నిర్వహించారంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా అనేక రాష్ట్రాల్లో రైతులతో భేటీ అయి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడడంలో పార్టీని అన్ని ప్రాంతాల్లోనూ చురుగ్గా ముందుకు తీసుకెళ్లారు. 


మొత్తానికి రాహుల్‌ శ్రమ ఫలించినట్లే అనుకోవాలి. అందుకే బిల్లుపై సర్కారు పునరాలోచిస్తున్నదని అనగానే.. రాహుల్‌ భాయ్‌ పండగ చేసుకుంటున్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల విజయంగా కాంగ్రెస పార్టీ ర్యాలీ నిర్వహించవచ్చు గాక, కానీ ప్రధానంగా రాహుల్‌ గాంధీనే ప్రొజెక్టు అవుతారనడంలో సందేహం ఏముంది? రాహుల్‌ యాత్రలు, ప్రచారాలు ఎన్నికల్లో ఆ పార్టీకి విజయాలు సాధించి పెట్టలేకపోతున్నాయి గానీ.. కనీసం.. ప్రజలకు కంటగింపుగా మారిన భూసేకరణ బిల్లునైనా తిప్పికొట్టగలిగాయి. అందుకు అభినందించాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: