సీరియస్ గా రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి సినిమా నటులు మినహా మిగిలినవారు రాజకీయాల్లో అంతగా రాణించడం అరుదు. అవడానికి ఓ ఎంపీనో, ఎమ్మెల్యేనో అయినా.. రాజకీయాలను పూర్తిగా వంటబట్టించుకున్నవారు తక్కువే. ప్రస్తుతం వైసీపీలో హడావిడి చేస్తున్న రోజా తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నం. రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉండటమే కాదు.. రాజకీయ నాయకులు ప్రవర్తనను బాగా వంటబట్టించుకుంది. 

వైసీపీ తరపున అసెంబ్లీలో రోజా చాలా చురుకైన పాత్ర పోషిస్తోంది. నేటి రాజకీయాల్లో వక్రీకరించడం.. ఒక మాటకు పది మాటలు అప్పగించడం బాగా రావాలి.. ఈ విషయాలను రోజా బాగానే తెలుసుకున్నట్టుంది. అందుకే తమ నాయకుడు ఓటుకు నోటు కేసు విషయం అసెంబ్లీలో ప్రస్తావించగానే.. ఆ ఇష్యూపై తానూ ఘాటు కామెంట్లు చేసింది. చంద్రబాబు ఆడియోలో మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. అన్న సంగతి అందరికీ తెలిసిందే. 

మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న మాటకు.. చంద్రబాబు ఎన్ని బ్రీఫ్ కేసులు తీసుకున్నారో అంటూ ఆరోపణలు గుప్పించేసింది. అలాగే రిషితేశ్వరి, మత్తయ్య కేసులనూ తన విమర్శల కోసం వాడేసుకుంది. రిషితేశ్వరి ఇష్యూలో మొన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రకటన చేస్తూ ఆ విద్యార్థిని నేటివ్ ప్లేస్ హన్మకొండ అన్నారు.. దీనిపైనా రోజా విమర్శలు గుప్పించింది. రిషితేశ్వరి తెలంగాణ అమ్మాయి అంటూ అబద్దాలు చెబుతున్నారని ఆమె నేటివ్ ప్లేస్ రాజమండ్రి అని విమర్శించింది. తెలంగాణ అమ్మాయి అని చెప్పి హోంమంత్రి తప్పించుకోచూస్తున్నారని రోజా విమర్శించింది. 

అలాగే.. మత్తయ్య కేసు కూడా ప్రస్తావించింది. ఓటుకు నోటు కేసు కోసం 16 సార్లు డీజీపీతో సమావేశమైన చంద్రబాబు.. రిషితేశ్వరి కేసు గురించి ఎన్నిసార్లు డీజీపీతో మాట్లాడారో చెప్పాలన్నారు. అలాగే రెవెన్యూ ఉద్యోగి వనజాక్షి విషయాన్ని ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసు కోర్టు పరిధిలో ఉంటే.. జగన్ కేసులను మాత్రం ఎందుకు ప్రస్తావిస్తున్నారన్నారు రోజా.. మొత్తం మీద ఆంధ్రా రాజకీయాల్లో రోజా బాగానే పండిపోయారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: