రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి తెలిసిందే. 2014లో ఎన్నికల్లో ఉపు, నిప్పూలా ప్రవర్తించిన టీడీపీ-టీఆర్ఎస్.. 2009 ఎన్నికల్లో జతకట్టిన విషయం మరచిపోకూడదు. అప్పట్లో వీరిద్దరి ఉమ్మడి శత్రువు రాజశేఖర్ రెడ్డి. ముందు ఆయన్ని ఓడించడమే అప్పట్లో ఇద్దరి నేతల ఉమ్మడి లక్ష్యం. అందుకే చంద్రబాబు, కేసీఆర్ చేతులు కలిపారు. మహా కూటమి పేరుతో ఒక్కటయ్యారు. అయినా ఫలితం దక్కలేదు. 

2014 నాటికి సీన్ మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి 2009లోనే హఠాన్మరణం చెందారు. రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు తెలుగుదేశం ప్రధాన శత్రువు. ఆంధ్రాలో జగన్ కు టీడీపీ ప్రధాన శత్రువు. అందుకే కేసీఆర్, జగన్ ఓ అవగాహనకు వచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఓటుకు నోటు కేసు విషయంలోనూ ఈ ఆరోపణలనే టీడీపీ వాడుకుంటోంది. 

టీడీపీ నేతలు ఆడియో, వీడియో రికార్డులతో సహా దొరికిపోయినా.. అదంతా కేసీఆర్- జగన్ కుట్ర అని ఆరోపించి తప్పించుకునేందుకే పసుపుదళం ప్రయత్నిస్తోంది. లేటెస్టుగా అసెంబ్లీ సమావేశాల సమావేశాల్లోనూ వైసీపీ ఓటుకు నోటు కేసు ప్రస్తావించినప్పుడు.. టీడీపీ నేతలు పాతపాటే పాడారు. కేసీఆర్ జగన్ కు ఫోన్ చేయడం వల్లే ఈ అంశాన్ని ప్రస్తావించారని టీడీపీ నేతలు ఆరోపించారు. 

టీడీపీ ఆరోపణలకు చెక్ చెప్పేందుకు జగన్ మంచి ప్రయత్నమే చేశారు. అలా అని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. లేకుంటే చంద్రబాబు రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ తో కుమ్మక్కు ఆరోపణలను తిప్పికొట్టేందుకు మహా కూటమి సమయంలో కేసీఆర్, చంద్రబాబు గుసగుసలాడుకుంటున్న ఫోటోలను చూపించి ఎదురు దాడికి దిగారు.. అప్పట్లో కేసీఆర్ తో అంటకాగిన సంగతి మరిచారా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రశ్నకు టీడీపీ దగ్గర సరైన సమాధానం లేకపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: