రాజకీయ పార్టీలు తమ ప్రతిపక్షాలను తిట్టిపోయడంలో అర్థంపర్థంలేని విమర్శలతో విరుచుకుపడడం కొత్త సంగతి కాదు. కానీ ఒకే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తే మాత్రం.. దాన్ని గురించి ప్రజల ఆలోచన కూడా సాగుతుంది. అలా ఆలోచించినప్పుడు.. ప్రస్తుతం వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి చేస్తున్న ఒక డిమాండు సబబేనా? అది న్యాయమేనా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఇంతకూ విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు ముగిసాయి. పేరుకు అయిదురోజుల పాటూ సమావేశాలు జరిగినా.. చర్చ సాగింది కేవలం 20 గంటలు మాత్రమే. 


సమావేశాలు ముగిసన తర్వాత.. విపక్ష నేత జగన్‌ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌పెట్టారు. సహజంగానే ప్రభుత్వాన్ని ఎండగడుతూ అనేక విమర్శలు గుప్పించారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన లేవనెత్తిన ఒక్క అంశం మాత్రం..ఆయన చిత్త శుద్ధి మీదనే అనుమనాలు రేకెత్తించే విధంగా ఉంది. 


ఈ ప్రెస్‌మీట్‌లో జగన్‌ మాట్లాడుతూ.. శాసనసభను కేవలం అయిదురోజుల పాటూ మాత్రమే నిర్వహించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభలో చర్చించవలసిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని వాటికి అవకాశం లేకుండా, సభను కేవలం అయిదు రోజుల్లోనే ముగించేశారని ఆయన అభ్యంతరాలు వినిపించారు. ఈ మాటలు వింటే జనం సమస్యల పట్ల జగన్‌ అంకిత భావం అబ్బురపరుస్తుంది. అయితే సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. కనీసం అయిదురోజులైనా సమావేశాలు జరిగాయి. అయితే ఈ అయిదురోజుల్లో జగన్‌ పార్టీ ఎన్ని ప్రజాసమస్యలను ప్రస్తావించిందో ఆయనే ఒకసారి ఆత్మసమీక్ష చేసుకోవాలి. 


'వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటోను అసెంబ్లీ లాంజ్‌లోంచి తీసేసారు' అనే అంశం మీద అసెంబ్లీలో దాదాపు రెండురోజుల సమయాన్ని వైకాపా స్తంభింపజేసింది. ఆ ఫోటోతో ప్రజలకు ఏంటి సంబంధం. వైఎస్సార్‌ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం అయితే, దానికి వైకాపా వారికి ఆవేదన ఉంటే.. వారు దానికోసం ఆమరణ నిరాహార దీక్షలు చేసుకోవచ్చు. మరో రకంగా పోరాడవచ్చు. అంతే తప్ప.. ప్రజల గురించి మాట్లాడ్డానికి ఉన్న శాసనసభలో సమయాన్నంతా దానికోసం ఖర్చుచేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టింది కేవలం తొమ్మిది బిల్లులు. అవి సభ ఆమోదం పొందేశాయి. ప్రజల కోసం చర్చించడానికి 15 రోజుల పాటూ సభ నిర్వహించాలి అని డిమాండుచేసినా పట్టించుకోలేదు అని చెబుతున్న జగన్మోహనరెడ్డి.. అన్నిరోజులు నిర్వహించినా.. మొత్తం అన్నిరోజులూ వైఎస్‌ ఫోటో కోసమే పోరాడుతూ ఉండరని గ్యారంటీ ఏమిటి? అయినా సభను ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది చాలా రోజుల ముందుగానే డిసైడ్‌ అయింది. అప్పట్లో దాని కోసం గట్టిగా ప్రశ్నించకుండా, ప్రయత్నించకుండా.. ముగిసిన తర్వాత.. 15రోజులు నిర్వహించలేదు అంటూ దెప్పిపొడవడం ఎలా సబబు అనిపించుకుంటుందో.. అర్థం కావడం లేదు. అందుకే ఈ విషయంలో జగన్‌ డిమాండు న్యాయబద్ధమైనదేనా? అనే అనుమానం కలుగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: