రాష్ట్రమంతా ఆసక్తి వీక్షించే అసెంబ్లీలో మాట్లాడాలంటే మంచి వాక్పటిమ, సమయస్ఫూర్తి ఉండాలి. టైముకు తగ్గట్టుగా పంచ్ లు విసరాలి. అవతలి పక్షం ఎత్తుగడలను ముందే పసిగట్టాలి. ఎప్పటికప్పుడు లేటెస్టు ఇష్యూలు అప్ డేట్ అవుతుండాలి. వైసీపీలో ఇలాంటి కసరత్తు చేసి ఆకట్టుకునేలా మాట్లాడే నాయకుల సంఖ్య కాస్త తక్కువే అని చెప్పాలి. సభ మొత్తం ఆసక్తిగా ఆలకించేలా మాట్లాడగలిగే నేతలు తక్కువే. 

వైఎస్ జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వై విశ్వేశ్వరరెడ్డి, రోజా.. ఇలాంటి వాళ్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. కానీ ఈ సమావేశాల్లో మాత్రం జగన్ తర్వాత బాగా హైలెట్ అయిన నాయకుడు జ్యోతుల నెహ్రూ.  తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన వైసీపీకి శాసనసభాపక్ష ఉప నేతగా ఉన్నారు. వైఎస్ వర్థంతి కారణంగా  ఈ సమావేశాల్లో ఒక రోజు జగన్ సభకు దూరంగా ఉండటంతో సభలో పార్టీని నడిపించే బాధ్యత జ్యోతులపైనే పడింది. 

జ్యోతుల నెహ్రూ ఈ అవకాశాన్నిబాగానే ఉపయోగించుకున్నారు. వైఎస్ ఫోటో వివాదాన్ని అసెంబ్లీలో బాగానే వినిపించగలిగారు. సభాపతి కూడా ఎప్పుడూ జ్యోతుల నెహ్రూతో మట్లాడుతూ ఇష్యూను చక్కబరిచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పట్టిసీమపై చర్చ జరిగినప్పుడు కూడా జ్యోతుల నెహ్రూ బాగానే ప్రసంగించగలిగారు. నీళ్లు ఇవ్వకుండానే ప్రాజెక్టును ఎలా జాతికి అంకితం చేస్తారని నిలదీయగలిగారు.

ఐతే.. పట్టిసీమ విషయంలో వైసీపీ నుంచి ఇద్దరు నేతలు మాట్లాడాలని తీసుకున్న నిర్ణయం వారిని ఇరకాటంలో పడేసింది. ఇదే అదనుగా సభానాయకుడు చంద్రబాబు రెచ్చిపోయారు. పట్టిసీమపై మీ పార్టీకో విధానం లేదా.. అంటూ నిలదీశారు. ఆ ఒక్క విషయలో జ్యోతుల వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారు. అది మినహా మిగిలిన అన్ని సమయాల్లోనూ నెహ్రూ జగన్ తలలో నాలుకగా వ్యవహరించారు. జగన్ కూడా నెహ్రన్నా.. నెహ్రన్నా.. నువ్వాగు నెహ్రన్నా.. అంటూ చనువుగా ప్రవర్తించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: