పరిపాలన అంటే చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం ఒక్కటి మాత్రమే అని అనుకుంటున్నారో ఏమో బోధపడడం లేదు. ప్రజాసంక్షేమం అంటే ఇప్పటివరకు చేసిన రుణమాఫీ మాత్రమే అన్నట్లుగానే ప్రతిసందర్భంలోనూ దాన్ని గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. ఇప్పుడు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం తెరమీదకు వచ్చినప్పుడు... రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా పోరాడడం ఎటూ వారికి చేతకాకుండాపోయింది. కనీసం.. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకునేలాగా అయినా.. తమ వాదనలు వినిపించాలి కదా..! చంద్రబాబు సర్కారు వాయిస్‌ లేని అచేతన శూరుల్లాగా ఆ పని కూడా చేయడం లేదు. అంబేద్కర్‌ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం సొంతం చేసుకుని, ఏపీ విద్యార్థులకు ఎడ్మిషన్లు నిలిపేస్తే.. బాబు సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. విద్యార్థుల లేఖలు ఆధారంగా హైకోర్టులో కేసు నడిచింది. ఎడ్మిషన్లు ఇవ్వాల్సిదేనని, స్టడీ సెంటర్లు నడపాల్సిదేనని హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఏపీలోని స్టడీ సెంటర్ల నిర్వహణ వ్యయం, వేతనాలు మొత్తం ఏపీ సర్కారే భరించాలని అందులో పేర్కొన్నారు. నిజానికి ఇలా స్టడీ సెంటర్ల ఆర్థిక భారం ఏపీ నెత్తిన వేయడం కూడా కరెక్టు కాదని పలువురు వాదిస్తున్నారు. ఎందుకంటే.. ఓపెన్‌ యూనివర్సిటీ లో చేరే విద్యార్థులు.. పెద్ద మొత్తాల్లోనే ఫీజులు చెల్లిస్తారు. స్టడీసెంటర్లనుంచి యూనివర్సిటీ నిర్వహణ, ప్రొఫెసర్ల జాతీల వరకు అంతా అందులోనే కలిసిపోయి ఉంటుంది. వారిచ్చే ఫీజుల్తోనే వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంటుంది. మరి ఎడ్మినిస్ట్రేషన్‌ను యూనివర్సిటీ చూస్తున్నది గనుక.. ఏపీ విద్యార్థులు కట్టే ఫీజు ప్రతిరూపాయీ.. ఇక్కడికే అందుతాయి.. అలాంటప్పుడు స్టడీ సెంటర్ల బాధ్యత కూడా వారిదే. కానీ.. కోర్టు భారం ఏపీ భరించాలని తీర్పు చెబితే.. కనీసం ఆ బాధ్యత తమది కాదనే వాదన వినిపించడానికి కూడా సర్కారు ప్రయత్నించలేదని.. తమ వాదనను చెప్పలేకపోయారని.. పలువురు దెప్పి పొడుస్తున్నారు. విద్యార్థుల ప్రయోజనాలు, వారి కష్టాలు అంటే ప్రభుత్వానికి ఎటూ లెక్కలేదు. కనీసం.. రాష్ట్రానికి ఆర్థిక భారం గురించి అయినా శ్రద్ధ తీసుకోవాలి కదా అని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: