చిత్తూరు జిల్లాలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బద్ధ శత్రువు మాజీ మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రాజచంద్రారెడ్డి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 30లోపు సీఎంగా కిరణ్ ను తొలగించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పెద్దిరెడ్డి గతంలోనే ప్రకటించారు. ఆమాటకు కట్టుబడే గురువారం నాడు రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పిస్తానని పెద్దిరెడ్డి ప్రకటించారు. పెద్దిరెడ్డితోపాటు ఐదుమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతా ఇప్పుడు వారంతా బయటకు వెళ్తారని ఊహించడం కష్టంగానే ఉంటుంది. ఈనెల 30న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బొటాబొటీ మెజారిటీతో ఉన్న ప్రభుత్వం పెద్దిరెడ్డి రాజీనామాతో మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అయితే కొంతకాలంగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని పెద్దిరెడ్డి గెలిపించారు. ఈ నేపథ్యంలో పెద్దరెడ్డి తమతో టచ్ లో ఉన్నారని, మా పార్టీలో చేరతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పెద్దిరెడ్డిని రాజీనామా చేయకుండా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే పెద్దిరెడ్డి కేవలం ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో తన అనుబంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: