రాష్ట్ర వాప్తంగా ఉన్న శిశు సంరక్షణ(బేబీకేర్ సెంటర్స్) కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని స్త్రీ శిశు సంక్షేమశాఖ సీమీక్ష సమావేశంలో నిర్ణయించింది. వివిధ శాఖల అధికారులు తొమ్మిది మందితో కమిటీని ఏర్పాటు చేసి 45 రోజుల్లో నివేదిక తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం ఖరారు చేసింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని సమీక్ష సమావేశం సోమవారం జరిగింది. ఇటీవల నగరంలోని బేబీ కేర్ సెంటర్లలో రెండు సంవత్సరాల వయసు గల బేబీ అన్వీత మృతి సంఘటన అనంతరం మంత్రి తక్షణమే స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శిశు సంరక్షణ కేంద్రాల పరిస్థితిని తెలసుకునేందుకు సమీక్ష నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కార్మీక శాఖ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు చేయాలని భావించారు. 45 రోజుల్లో రాష్ట్రంలోని నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలను పరిశీలించడంతో పాటు కేంద్రాల అవసరాలను గుర్తించాలని నిర్ణయించారు. పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సమావేశానికి హాజరైన అధికారులను ఆదేశించారు. సోషల్ వెల్పేర్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్జీవో నిర్వహాణలో ఉన్న శిశు సంరక్షణ కేంద్రాలపై డేగ కన్ను పర్యవేక్షణ ఉంచాలని మంత్రి సునితా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శిశు సంరక్షణ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. కేంద్రాలు నిబంధనలకు లోబడి ఉన్నాయా? కేంద్రాల పరిమితులను పునరుద్దరణ చేసుకుంటున్నారా? నిబంధనల ప్రకారం నాణ్యతను కాపాడుతున్నాయా? అనే అంశాలతో పాటు ప్రెవేట్ డేకేర్ సెంటర్ల అనుమతి తప్పనిసరి నిబంధనను కమిటీ పరీశీలన జరపాలని చెప్పారు. శాఖా పరంగా ఇప్పటికే బాలల కేంద్రాలు, అనాధ ఆశ్రమాలను నిర్వహించిన అనుభవం ఉన్నందున శిశు సంరక్షణ కేంద్రాల నిర్వాహణకు సిద్దమవ్వాలని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి తెలియజేశారు. సమావేశంలో ముఖ్య కార్యదర్శి నీలం సహాని, డైరెక్టర్ చిరంజీవి చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: