ఇంద్రాణి ముఖర్జియా అంటే.. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వార్తల్లోని వ్యక్తి. పలువురు సెలబ్రిటీలను ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుంటూ.. కన్న కూతురిని.. గర్భిణిగా ఉండగా.. ఒక మాజీ భర్తతో కలిసి అంతమొందించి.. ఇలా నానా బీభత్సమయిన వక్ర వ్యవహారాలు ఇంద్రాణి ఎపిసోడ్ లో వెలుగుచూశాయి. మానవ సంబంధాలనే అపహాస్యం చేసే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కన్న కూతురును అమానుషంగా చంపిన ఆమె , తన తల్లి చనిపోయిందన్న సంగతి తెలుసుకుని గుండెపోటుకు గురయిందన్న వార్తలు కూడా పలువురిని ఆశ్చర్య పరిచాయి. ప్రస్తుతం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ రెండో పార్ట్ గమనించిన వారు.. అంతటి కరడు గట్టిన రాతి గుండె గల ఇంద్రాణి ముఖర్జీ లో ఆత్మహత్యకు పాల్పడేంత సున్నితత్వం, ఎమోషన్స్ ఉన్నాయా అని అనుకుంటున్నారు. 


కన్నకుమార్తెను హత్య చేసిన నేరంలో ఆరోపణలకు గురై ప్రస్తుతం జైలు కస్టడీలో ఉన్న మాజీ మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ నిద్రమాత్రలు మోతాదుకు మించి తీసుకుని ప్రస్తుతం ముంబైలోని జెజె ఆసుపత్రిలో ఉన్నారు. అయితే ఆమె అస్వస్థతకు ఆస్పత్రి వర్గాలు, జైలు అధికారులు పరస్పర విరుద్ధ కారణాలు చెబుతుండటంతో మరింత గందరగోళం చెలరేగుతోంది. 
ఆమె ఇప్పుడు పూర్తి స్పృహలో లేరని శ్వాస సమస్య ఇంకా ఉంటున్నందున మరో మూడు రోజులు గడిస్తే కాని ఆమె ప్రమాదం నుంచి బయటపడింది లేనిది చెప్పలేమని ఆస్పత్రి డీన్ తాజాగా ప్రకటించారు. ఆమె నిద్రమాత్రలు మింగారా లేక మాదక ద్రవ్యాలు పుచ్చుకున్నారా అనేది  తేల్చడానికి ఆమె పొట్టలోని అవశేషాలను పరీక్షకు పంపించామన్నారు. కానీ అమెపై విషప్రయోగం జరిగిందన్నమాట వాస్తవం కాదని, మోతాదుకు మించి తీసుకున్న మందులే వికటించాయని జేజే హాస్పిటల్ డీన్ టిపి లహానే చెప్పారు.


కాగా జైలులో నిద్రలేమి, బలహీనత కారణంగానే ఇంద్రాణి అధిక మోతాదులో మాత్రలు తీసుకుని ఉండవచ్చని ప్రత్యేక పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ బిపిన్ కుమార్ సింగ్ తెలిపారు. ఇంద్రాణి ఆ మాత్రలను రోజువారీగా స్వీకరించకుండా సేకరించి పెట్టుకుని శుక్రవారం నాడు ఒకేసారి వాటిని తిని ఉండవచ్చని, ఆ అవకాశాన్ని తోసిపుచ్చలేమని జైలు అధికారులు అంటున్నారు. వ్యక్తి మానసిక స్థితిని స్థిరంగా ఉంచడానికి నిర్దిష్ట పరిమితుల్లో ఔషధాలు రాస్తుంటామని, వాటిని మోతాదుకు మించి తీసుకుంటే మైకం కమ్మడమే కాకుండా కోమాలోకి కూడా వెళ్లే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 


మీడియా టైకూన్‌గా, స్టార్ టీవీ మాజీ సీఈఓ భార్యగా ఒక వెలుగు వెలిగిన ఇంద్రాణి కన్నకూతురిని స్వయంగా హత్య చేసిన కేసులో తాను జైలుకు వెళ్లవలసి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. ఇక ఎలాగూ ఈ కేసునుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించి జీవితాన్ని ముగించుకోవాలన్న అభిప్రాయానికి ఆమె వచ్చిఉంటుదన్న అంశాన్ని కూడా తోసిపుచ్చలేమని విశ్లేషకుల ఉవాచ. 


మరింత సమాచారం తెలుసుకోండి: