'మీరు పోరాడండి.. మేం సహకరిస్తాం' అని చెప్పవలసింది ఎవరు? తమను తాము సెకండ్‌గ్రేడ్‌ నాయకులుగా భావించుకునే వారు! వారు మాత్రమే తాము సొంతంగా పోరాడడం అనేది కష్టం అనుకుంటారు గనుకనే.. తమను మించిన వారు తాము కూడా ఇష్టపడే సారూప్యత ఉన్న అంశం కోసం పోరాడుతున్నప్పుడు.. వారితో పాటూ తాము సహకరించవచ్చునని అనుకుంటారు. కానీ రాజకీయాల్లో మాత్రం సీను రివర్స్‌లో ఉంటుంది. బలం ఉన్నా లేకపోయినా.. ప్రతివాడూ తానే నాయకత్వం వహించాలని కోరుకుంటూ , వెంపర్లాడుతూ ఉంటారు. 


ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఓ వెరైటీ స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం.. పార్లమెంటు వేదికగా కాంగ్రెస్‌ పార్టీ వారు పోరాడితే.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు వెనుకనుంచి సహకరిస్తారుట. వీళ్లే పోరాడుతూ వారి సహకారం కోరితే వీరికి పోయేదేముంది. నిజంగానే ముద్దుకృష్ణమనాయుడుకు గానీ, తెలుగుదేశం పార్టీకి గానీ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలని, అందుకోసం తాము వీసమెత్తు అయినా సరే పోరాడాలని గానీ ఒక సదాలోచన ఉన్నట్లయితే.. అలాంటి పోరాటానికి వారే నేతృత్వం వహిస్తే ఎవరైనా వద్దన్నారా? ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి కాంగ్రెసు పార్టీకి లోక్‌సభలో ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా లేరు. అదే తెదేపాకు బోలెడంత మంది ఉన్నారు. అక్కడికి సంఖ్య తక్కువైనట్లు వైకాపానుంచి గెలిచిన వారిని కూడా ఫిరాయింపజేసి తమలో కలుపుకుని వారు చెలరేగుతున్నారు. అలా సంఖ్యాపరంగా చాలా హెచ్చుగా ఉన్న వారు పార్లమెంటు వేదికగా పోరాడాలి గానీ.. అసలు సభ్యులేలేని కాంగ్రెసు పార్టీని పార్లమెంటులో పోరడాల్సిందిగా ముద్దు కృష్ణమనాయుడు ఉచిత సలహాలు ఇవ్వడం చాలా కామెడీగా ఉంది. 


ఏపీసీసీ తరఫున చీఫ్‌ రఘువీరారెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం.. రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉండగా, వాటిని పనిగట్టుకుని ఆడిపోసుకోవాలని ముద్దుకృష్ణమ తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. రఘువీరా మొసలి కన్నీరు కారుస్తున్నారని అంటున్న ముద్దుకృష్ణమ మరి హోదా కోసం తమ పార్టీ ఏం చేస్తున్నదో మాత్రం చెప్పలేకపోతున్నారు. ప్రతిపక్షాలకు చేతనైతే పార్లమెంటులో దీక్షలు చేయాలని, అందుకు అవసరమైతే తాము సహకరిస్తామని ముద్దు అంటున్నారు. మరి.. ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో కూడా... కనీసం రాజ్యసభలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏపీ ఎంపీలు తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని.. నిరసనలు తెలియజేశారు. ఆ చోటుకు తగిన రీతిలో పోరాడారు. మరి తెదేపా వారితో ఎందుకు జతకలవలేకపోయింది. తెదేపా వారు కూడా ప్లకార్డులతో వారికి సహకారంగా నిరసనలు తెలియజేసి ఉండొచ్చు కదా.. అని ప్రజలు అడుగుతున్నారు. అయినా ఏదో జనాంతికంగా స్టేట్మెంట్లు ఇచ్చేయడం కాదు.. ప్రజలు తమ మాయమాటల్ని జాగ్రత్తగా గమనిస్తుంటారని ఎంతో సీనియర్‌ అయిన ముద్దుకృష్ణమ తెలుసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: