విభజన తర్వాత ఆంధ్రా, తెలంగాణ పలు విషయాల్లో పోటీపడుతున్నాయి. రెండు ప్రభుత్వాల అధినేతలు కూడా తాము గొప్పగా చేస్తున్నామంటే.. తాము గొప్ప అని నిరూపించుకనే ప్రయత్నాల్లో ఉన్నారు. మొన్నటికి మొన్న ఏపీకి ప్రపంచ బ్యాంకు సర్వేలో పెట్టుబడుల అనుకూల రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ అవకాశం తెలంగాణకు వచ్చింది. ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజేన్సీ రిపోర్టులో తెలంగాణకు మెరుగైన స్థానం లభించింది. ఏ వన్ కేటగిరి ఆర్థికశక్తి రాష్ట్రంగా రేటింగ్ లభించింది. రుణాల చెల్లించే స్థోమత, ప్రభుత్వ విధానాలను దృష్టిలో పెట్టుకొని ఇక్రా సంస్థ ఈ రేటింగులను ప్రకటిస్తుంటుంది. గతంలో సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీకి ఏ మైనస్ రేటింగ్ వచ్చింది. 

ఏపీ విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఏ ప్లస్ కేటగిరీలోకి వెళ్లిందట. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణమట. ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు పెడుతున్న ఖర్చుతో వ్యవసాయరంగం మెరుగవుతుందని ఇక్రా రిపోర్ట్ తెలిపింది. ఈ ఇక్రా రేటింగ్ వల్ల తెలంగాణకు ఉన్న రుణాలపై కూడా కాస్త వడ్డీ భారం తగ్గుతుందని అంటున్నారు. 

పెట్టుబడులు పెట్టే ఇండస్ట్రియలిస్టులు కూడా ఇక్రా రేటింగ్ ఆధారంగానే ముందుకొస్తారని తెలంగాణ మద్దతుదారులు చెబుతున్నారు. మొన్నటి ప్రపంచ బ్యాంకు సర్వే ఫలితాలను చంద్రబాబు ఇప్పుడు అన్ని వేదికలపై ఊదరగొడుతున్నారు. నెంబర్ త్రీ కాదు.. నెంబర్ వన్ కావాలంటూ లెక్చర్లు దంచుతున్నారు. ఇప్పుడిక కేసీఆర్ ఇక్రా రేటింగ్ పాట పాడతారేమో. పోనీలెండి అభివృద్ధిలో పోటీపడితే మంచిదే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: