ఆ ఎన్‌కౌంటర్ దురదృష్టకరం... ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఏ మంత్రిని మీడియా పలకరించినా ఇదే పాట. ఉన్నత చదువులు వదిలి ఉద్యమాల బాట పట్టిన అతి స్వల్ప కాలంలోనే ఎన్‌కౌంటర్లో నేలరాలిన శృతి, విద్యాసాగర్‌లు ప్రస్తుతం తెలంగాణ మంత్రులను, టీఆరెస్ మంత్రులను భూతంలాగా ఆవహిస్తున్నారనిపిస్తోంది. నీళ్లకోసం వచ్చి తమ చేతచిక్కిన ఆ ఇద్దరినీ ప్రత్యేక పోలీసు బలగాలు పరమ కిరాతకంగా హింసించి చంపారని వచ్చిన వార్తలు తెలంగాణ సమాజాన్ని కదిలించివేశాయి. నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని, వారికీ మాకూ తేడా లేదని తొలినుంచి చెప్పుకున్న తెరాస నాయకత్వం, ప్రభుత్వం ఈ ఎన్‌కౌంటర్ విషయంలో పూర్తిగా ఢిపెన్స్ లో పడినట్లే కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంత దారుణ హత్యలను చూడలేదని తెలంగాణ మేధావులు ఆక్రోశిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ స్థాయిలోనే నష్టనివారణకు ప్రయత్నం జరుగుతున్నట్లుంది. రెండు రోజుల వ్యవధిలో అటు సీనియర్ మంత్రి కడియం శ్రీహరి, ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, నిన్న కీలకమంత్రి కేటీఆర్ సందు దొరికిందే చాలన్నట్లుగా ఆ ఎన్‌కౌంటర్ గురించి స్పందించడానికి సిద్ధం కావడం అరుదైన విషయమనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో చేయి చేయి కలిపి పనిచేసిన శృతి ఇలా కనుమూయటం బాధాకరమని కవిత ప్రకటిస్తే,  ఆ ఎన్‌కౌంటర్ నిజంగా దురదృష్టమని , తుపాకి మోతల్లేని తెలంగాణే నేటికీ తమ లక్ష్యమని కేటీఆర్, కడియం శ్రీహరి పదే పదే మీడియాకు వివరణ ఇచ్చారు.


విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు కొత్త భయం మొదలైంది. ఆ దారుణ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని, నెత్తుటి బాకీ అంతకు అంతా చెల్లిస్తామని మావోయిస్టు నేతలు చేసిన ప్రకటన యావత్ తెలంగాణలో నేతలను ఇప్పుడు భీతిల్ల జేస్తోంది. ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా గ్రామాల నుంచి, మండల కేంద్రాలనుంచి, చిన్న చిన్న పట్టణాల నుంచి హైదరాబాద్‌కు నేతలు పరుగెత్తుకొచ్చే పరిస్థితి కొంత కాలంగా తెలంగాణలో లేదు. మావోయిస్టుల వ్యూహాత్మక తిరోగమనం కూడా ఇందుకు కారణం కావచ్చు. కానీ ఎలాంటి నేరచర్యలూ చేపట్టకుండా తమ పని తాము చేసుకుపోతున్న నక్సలైట్లను ఈ ఎన్‌కౌంటర్ తీవ్రంగా రెచ్చగొట్టిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ వారి ప్రతీకార చర్యలు తమపై పడతాయో అనే భయం చోటా మోటా నేతల నుంచి బడా నాయకుల వరకు వ్యాపించినట్లు సమాచారం. పరిస్థితిని కాస్త ఉపశమించే తీరులో ప్రభుత్వ నేతలే ఇలా ఒకరివెనుక ఒకరు ఆ ఎన్‌కౌంటర్ దురదృష్టకరమని ప్రకటిస్తున్నారని తెలిసింది. 


రక్తం చిందింపజేసిన వారే ఇప్పుడు అది తమ అభిమతం కాదని ఏదో అలా జరిగిపోయిందని చెప్పడం కంటే కపటత్వం మరొకటి ఉండదు. ఇలా ఏదో మాటలు చెప్పేయడం కాదు.. తమ నిరసనల్ని తెలియజేయడానికి ప్రయత్నించిన సానుభూతి పరుల్ని సర్కారు ఎంత కర్కశంగా అణిచివేసిందో కూడా అందరూ చూశారు. మరి వారికి నమ్మకం కలిగేలాగా.. ఓ భేటీ పెట్టి మంత్రులు ఈ విషయం వెల్లడిస్తే.. వారికి మన్నన దక్కుతుందని అనుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: