ఆయనో సీనియర్ సీమ రాజకీయ నాయకుడు. అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన ఉన్న అతి కొద్ది మందిలో ఒకడు. మొదట్లో కాంగ్రెస్ లోనూ.. ఆ తర్వాత టీడీపీలోనూ.. కీలకపాత్ర పోషించాడు. జగన్ వైసీపీ పెట్టిన తర్వాత.. ఆయన పార్టీలో చేరాడు.. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది ఆయన మైసూరారెడ్డి అని. అలాంటి సీనియర్ నేత కొన్నిరోజులుగా వైసీపీలో కనిపించడమే లేదు. 

టీడీపీలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని మరోసారి కొనసాగించలేదన్న కోపంతోనే ఆయన వైసీపీ వైపు వచ్చాడని విమర్శకులు గుర్తుచేసుకుంటుంటారు. ఏపార్టీలో ఉన్నా మైసూరాకు మంచి ప్రాధాన్యమే దక్కేది. ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానం, వాగ్దాటి కారణంగా ఆయన టాలెంట్ కు తగిన గుర్తింపు దొరికేది. కానీ పాపం.. కొన్నాళ్లుగా ఆయనకు వైసీపీలో గుర్తింపే లేకుండా పోయింది. 

సొంత జిల్లా, సొంత సామాజిక వర్గం అనే సమీకరణాల నేపథ్యంలో వైసీపీలో చేరిన మైసూరా రెడ్డి.. జగన్ వైఖరితో పూర్తి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేరా అనేంతగా సైలంటైపోయారు. దీంతో ఆయన పార్టీలో ఉన్నా లేనట్టే అయ్యింది. జగన్ కూడా ఆయన సేవలను ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు కనిపించడంలేదు. 

ఈ నేపథ్యంలో మైసూరా రెడ్డి జగన్ ను విడిచిపెడతారని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మైసూరా వదిలేయడం కాదు.. జగనే మైసూరాను పట్టించుకోవడం  లేదని మరికొందరంటారు. కాకపోతే.. ఇప్పుడు మైసూరా రెడ్డి మారేందుకు కూడా మంచి ప్లాట్ ఫాం అనేది లేకుండా పోయింది. టీడీపీలోకి మళ్లీ వెళ్లలేరు. కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. మరి.. మైసూరా ఏం చేస్తారో..?



మరింత సమాచారం తెలుసుకోండి: