ఏపీ సీఎం ఈమధ్య సింగపూర్ లాంటి రాజధాని గురించి తప్ప ఇతర విషయాలపై అంతగా మాట్లాడటం లేదు. సింగపూర్ పర్యటనలు, రాజధానిపై సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ప్రపంచం మెచ్చే రాజధాని కావలసిందే. కానీ మిగిలిన విషయాలు కూడా కాస్త పట్టించుకుంటే మంచిదంటున్నారు సీనియర్ రాజకీయనాయకులు, అధికారులు. 

ఎందుకంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కరువు ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలోని కరువు మండలాల సంఖ్య 200లకు పైనే ఉంటుందని అధికార వర్గాల సమాచారమే చెబుతోంది.  వర్షపాతం నివేదికల ప్రకారంమే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా. మొత్తం 13 జిల్లాల్లో ఆరు జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా ఉందట. అంటే దాదాపు సగం ఆంధ్రప్రదేశ్ ను కరువు రాక్షసి కాటేయబోతోందన్నమాట.

పాపం.. కరువుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనంతపురం జిల్లాలో ఈ సారి పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాలూ కరువు మండలాలుగానే పాటించాల్సిన దుస్థితి ఇక్కడ ఉంది. ఇటీవల ఈ జిల్లా నుంచి కేరళ వెళ్లి అష్టకష్టాలు పడుతున్న రైతులపై ఈనాడు అదిరిపోయే కథనం కూడా ప్రచురించింది. 

రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి కరువు మండలాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ వర్షాల సీజన్ ప్రారంభంలో కాస్త మురిపించినా.. జులై, ఆగస్టులో సరిగ్గా వానలు పడలేదు. కరువు ఏ ఒక్క వర్గాన్నో కాకుండా అందరినీ ప్రభావితం చేసే రాక్షసి. ఈ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకోకపోతే.. అది అల్టిమేట్ గా చంద్రబాబుకు చెడ్డపేరు తెచ్చే ప్రమాదం ఉంది. అసలే బాబొస్తే కరువస్తుందని దిక్కుమాలిన ప్రచారం ఉండనే ఉంది. సో.. బాబు గారు కాస్త అలర్ట్ గా ఉంటే బెటర్.


మరింత సమాచారం తెలుసుకోండి: