తెలుగుదేశం మంత్రి శిద్దా రాఘవరావుగారికి పూనకం వచ్చేసినట్లుంది. పార్టీ జాతీయ కోశాధికారి పదవి దక్కగానే టీడీపీ విస్తరణ గురించి పసుపు రంగుల కలలు కనడానికి సిద్ధపడిపోయారీయన. జాతీయ తోక తగిలించుకున్నంతమాత్రాన ఒక కోశాధికారి దేశమంతా పార్టీని విస్తరించడం ఎలా సాధ్యం అనే ఇంగితం కూడా తెలియకుండా  మాట్లాడుతున్న రవాణాశాఖ మంత్రి గారి నోటి వెంట ఈ సందర్భంగా వచ్చిన మాటలు బహు పసందుగా ఉంటూ నవ్వు తెప్పిస్తున్నాయి.. డాన్ క్విక్జోట్ గతంలో గాల్లో కత్తి యుద్ధం చేసిన చందాన దేశంలో టీడీపీ విస్తరణను ఎలా చేయవచ్చో అక్కడికక్కడే చూపించేశారీయన. ఆ మాటలను వింటే చాలు మనకు విస్తరణ అంటే ఎలా ఉంటుందో బోధపడిపోతుంది.


కోశాధికారి పదవి పొందిన వీరావేశంతో ఈయన ఎన్ని అబద్ధాలు అలవోకగా అల్లేశారో చూడండి. గత 16 నెలలుగా చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఎంతగానో అభివృద్ధి చేసిపడేశారని తొలి టముకు వాయించారు. సంక్షేమ కార్యక్రమాలతో తెలుగు ప్రజల గుండెల్లో బాబు నిలిచిపోతున్నారని మరో డుండుం వాయించారు.(గుండెల్లో నిలిచిపోవడం మాటేమిటో గాని, బాబు పేరు వింటేనే జనం పారిపోతున్నారన్నది వేరే విషయం). తెలుగు దేశం జాతీయ కార్యదర్శి పదవికి శ్రీమాన్ నారా లోకేష్ బాబు గారికంటే మించిన మొనగాడు యావత్ పార్టీలోనే లేరని పెద్ద మునగ చెట్టు ఎక్కించేశారు. పదవి ఇచ్చిన పెద్దమనిషిని ఆమాత్రం ఉబ్బేయకపోతే బాగుండదు కదా. 


నిజమే మరి. రోజూ ఉదయం నిద్ర లేస్తూనే ఇలాంటి పొగడ్తల టముకులను కొన్నింటిని దేశం మీదికి వదులుతుంటే చాలు.. తెలుగుదేశం జాతీయ విస్తరణ జరిగిపోతుంది మరి. అయినా.. ప్రాంతీయ పార్టీల ముద్ర వేసుకున్న పార్టీలు జాతీయవ్యాప్త విస్తరణలో దశాబ్దాలుగా చతికిలపడి పోతున్న చరిత్రను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం వంతు వచ్చినట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: