అవునా.. కేసీఆర్‌ కొన్ని నెలలుగా చెబుతున్న మాటలన్నీ ఉత్తుత్తివేనా? ఆ మాటల్లో అసలు నిజం ఎంతమాత్రమూ లేదా? మరి అలాగైతే.. ఇన్నాళ్లుగా.. కేసీఆర్‌ మాటల్ని నమ్ముకున్న తాము పెంచుకుంటున్న ఆశలన్నీ అడియాసలేనా? అని తెలంగాణలోని పలువురు నాయకులు నివ్వెరపోతున్నారు. అయితే కేసీఆర్‌ ఇచ్చిన మాట 'ఉత్తుత్తిదే' అని అనుమానం కలిగేలా సెలవిచ్చినది ఎవరో దారినపోయే దానయ్య అయితే వారు కూడా పెద్దగా పట్టించుకునే వారు కాకపోవచ్చు. అది సాక్షాత్తూ అల్లుడు హరీష్‌రావే కావడంతో.. వారంతా.. ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 


ఇంతకూ ఇంతగా ఆందోళన చెందే విషయం ఏంటబ్బా అనుకుంటున్నరు కదా! అది తెలంగాణ మంత్రివర్గ విస్తరణ గురించి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలి కాలంలో ఇద్దరు ముగ్గురు తెలంగాణ ప్రముఖులకు మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్లుగా మాట ఇచ్చారు. అదేమీ వారు తనను వ్యక్తిగతంగా క్యాంపు ఆఫీసులో కలిసినప్పుడు ఇచ్చిన మాట కూడా కాదు. ఎంచక్కా... ప్రజల మధ్య బహిరంగ సభల్లోనే వారిని మంత్రిని చేయబోతున్నా అంటూ ప్రజలకే మాట ఇచ్చారు. అంటే మంత్రి వర్గ విస్తరణ (పునర్‌వ్యవస్థీకరణ) త్వరలోనే ఉంటుందని అంతా అనుకుంటూ వచ్చారు. ఎటూ తెలంగాణ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేని వైనం మరియు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలా మంది పనితీరు మీద సీఎం గుర్రుగా ఉన్నారనే సమాచారం అన్నీ కలిపి రోజులవ్యవధిలోనే మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుదని ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ సెషన్స్‌ అయిపోయాక.. విజయదశమి పండుగ సందర్భంగా.. ఈ తాయిలాలు ఉండవచ్చనని ఊహిస్తున్నారు. 


అయితే ఇవాళ కేసీఆర్‌ అల్లుడు, తెలంగాణ సర్కారులో కీలక మంత్రి హరీష్‌రావు క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వస్తున్న వార్తలు అన్నీ ఊహాగానాలుమాత్రమే అని ఆయన తేల్చేశారు. పాపం.. కేసీఆర్‌ ఇప్పటికే ఒకవైపు కేబినెట్‌ పదవికి అన్ని అర్హతలతో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న, ఇప్పటికే పలుమార్లు అలిగిన కొప్పుల హరీశ్వర రెడ్డికి, తెలంగాణ ఉద్యమకారుడు రసమయి బాలకిషన్‌కు ఇలా పలువురికి హామీలు ఇచ్చారు. ఎటూ ఇప్పటిదాకా మహిళలు లేరు గనుక.. విస్తరిస్తే ఛాన్సు గ్యారంటీ అని కోవ లక్ష్మి, కొండా సురేఖ వంటి వారు కోటి ఆశల్తో ఎదురుచూస్తున్నారు. కానీ.. ఇవాళ హరీష్‌రావు ఇచ్చిన క్లారిటీతో పాపం ... ఈ నాయకులందరినీ నిరాశ ఆవరిస్తుందేమో. కాకపోతే కేసీఆర్‌ మాటలు నిజం కాదని.. హరీష్‌ తో ఆయనే చెప్పించారో ఏమో అని కూడా కొందరు భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: