రాష్ట్ర విభజన సందర్భంగా ఇటు ఆంధ్రా, అటు తెలంగాణ రెండూ కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వచ్చింది. ప్రధానంగా హైదరాబాద్ అప్పట్లో చిక్కుముడిగా మారింది.  భాగ్యనగరాన్ని యూటీ చేయాలని ఏపీ నేతలు డిమాండ్ చేశారు. అసలు హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకే ఇచ్చేయాలని ఉమ్మడి రాజధాని కూడా రెండేళ్లో, మూడేళ్లో చాలని తెలంగాణ వాదులు వాదులాడారు. 

ఫైనల్ గా హైదరాబాద్ ను యూటీ చేయకుండా.. పదేళ్లు ఉమ్మడి రాజధాని హోదా ఇచ్చారు. ఐతే.. ఆంధ్రా గవర్నమెంట్ త్వరగా హైదరాబాద్ వదలిపెట్టాలని పదేళ్లు ఎందుకు ఉండాలని కేసీఆర్ తదితరులు కోరుకున్నారు. ఐనా.. చట్టాన్ని గౌరవించక తప్పదు కాబట్టి.. పదేళ్లపాటు ఏపీ నాయకులను, కార్యాలయాలను భరించక తప్పదనుకున్నారు. కానీ చంద్రబాబు కేసీఆర్ కల త్వరలోనే నెరవేర్చేలా కనిపిస్తున్నారు. 

ఇకపై ఆంధ్రాలోనే ఎక్కువ రోజులు గడుపుతా అన్న సీఎం చంద్రబాబు ఇప్పటికే దాన్ని అమలు చేశారు. విజయవాడకు మకాం మార్చి హైదరాబాద్ కు గెస్ట్ గా మారిపోయారు. కానీ అసెంబ్లీ, సచివాలయంల విషయంలోనూ చంద్రబాబు తొందరపడుతున్నారు. కార్యాలయాల తరలింపు కూడా బాగా స్పీడప్ అందుకుంది. ఇప్పుడు లేటెస్టుగా మరో ఆశ్చర్యకరమైన డెసిషన్ తీసుకున్నారు. 

రాజధాని శంకుస్థాపన చేసే తుళ్లూరులోనే వచ్చే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ నిర్వహించే స్థాయి భవనాలు తుళ్లూరు లేకపోయినా సరే.. అక్కడే నిర్వహించాలని డిసైడయ్యారు. సమావేశాల ఏర్పాట్ల బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పగించాలని ప్రతిపాదించారు. హ్యాయ్‌ల్యాండ్‌, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ అతిధి గృహాల్లో ఎమ్మెల్యేలకు బసను ఏర్పాటు చేయాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చేసిన ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ఏపీ వ్యవహారం చూస్తే ఇంకో ఏడాదిలో హైదరాబాద్ తో అవసరం లేకుండానే గడిపేసేలా కనిపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: