ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం అంటే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అడ్డం పడడం అనే అర్థం తీసుకుంటే తప్పు. అలాంటి విధానాలతో వెళ్లినప్పుడు ఏదో ఒకటి రెండు సందర్భాలు కలసి వస్తాయేమో గానీ.. చేదు అనుభవాలు తప్పవు. ఏదో ఉద్ధరించాలని వెళితే ఇంకేదో అయినట్టుంది రఘువీరారెడ్డి పరిస్థితి.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నంతవరకు ఆ పార్టీ చేపట్టిన ఏ చర్యనూ ఏ స్థాయిలోనూ కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయని ఏపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డికి హఠాత్తుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల పట్ల మెలకువ వచ్చినట్లుంది.  కాకపోతే అది ప్రజలకే మింగుడు పడ్డం లేదనేది చిత్తూరు జిల్లాలో తేటతెల్లమైపోయింది. తాను ప్రతిపక్షానికి చెందిన నాయకుడు గనుక.. ప్రభుత్వం ఏంచేసినా సరే.. దాని తను అడ్డుకుంటూ ఉన్నప్పుడే తన పదవికి విలువ అని ఆయన భావిస్తున్నట్లుగా ఉన్నది. అందుకే కాబోలు.. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగువ చివర్న భోగాపురంలో విమానాశ్రయం వస్తున్నా సరే.. ఇటు కింద చివర కుప్పంలో విమనాశ్రయం వస్తున్నా సరే.. దాన్ని అడ్డుకుని తన సత్తా నిరూపించుకోవడానికి ఆయన ఆరాటపడిపోతున్నట్లుగా ఉంది. 


చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లె వద్ద విమానాశ్రయ నిర్మాణం ద్వారా భూములు కోల్పోబోతున్న రైతులను కలిసేందుకు వెళ్ళిన రఘువీరారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.  కుప్పం మండలం లక్ష్మీపురం వద్ద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు జాతీయ రహదారిపైకి చేరి రఘువీరారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.  ఈ క్రమంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాటలు చోటుచేసుకోగా చివరికి పోలీసుల జోక్యంతో కాస్త సద్దుమణిగింది.  సంఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పీ శంకర్ తో తెదేపా నాయకులు రఘువీరారెడ్డి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునేందుకే వచ్చాడనీ, ఆయన తమకు సమాధానం చెపితే తప్ప ముందుకు కదలనివ్వమనీ పట్టుబట్టారు.


అయినా ఇది కాస్త అతిశయం కాకపోతే.. కుప్పం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం. పైగా అక్కడ ఆయన ప్లాన్ చేస్తున్న విమానాశ్రయం కూడా.. స్థానికంగా ఆ ప్రాంతమంతా విపరీతంగా బాగుపడడానికి ఉద్దేశించినది. దాన్ని కూడా అడ్డుకోడానికి రఘువీరా వెళ్తానంటే ప్రజల  నుంచి నిరసన రాకుండా మరేం జరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: