కొన్ని సంవత్సరాలపాటు బద్ధ శత్రువుల్లా అక్షర యుద్ధం చేసుకున్న వైఎస్ జగన్, రామోజీరావు.. ఇటీవల ఫిలింసిటీలో భేటీ కావడం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏదో శుభకార్యంలో కలుసుకోవడం కాకుండా జగన్.. ప్రత్యేకించి పని కట్టుకుని ఫిలింసిటీకి వచ్చి రామోజీ శరణు కోరడం కలకలం సృష్టించింది. దీనికితోడు ఈ పరిణామంపై ఇటు సాక్షి కానీ.. అటు ఈనాడు కానీ ఒక్క ముక్క కూడా రాయకపోవడంతో ఊహాగానాలకు మరింత జోష్ వచ్చింది. 

రామోజీ-జగన్ భేటీతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని కొందరు నమ్ముతున్నారు. ఏపీలోనే కాదు.. ఢిల్లీస్థాయిలోనూ రామోజీకి మంచి పరిచయాలు,  పలుకుబడి ఉండటంతో కయ్యం కంటే నెయ్యమే మేలని జగన్ డిసైడయ్యారని తెలుస్తోంది. జగన్.. రామోజీ శరణు కోరారని.. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అప్పుడే ఈనాడు గ్రూప్ లో జగన్ కవరేజ్ పెరిగిందని కొందరు అంటున్నారు కూడా. కానీ అది రెగ్యులర్ కవరేజే కానీ ప్రత్యేకం ఏమీ లేదనే వారూ ఉన్నారు. ఇప్పుడు జగన్ దీక్ష నేపథ్యంలో ఈనాడు గ్రూప్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జగన్ కవరేజ్ పెరిగితే రామోజీ-జగన్ మధ్య సయోధ్య కుదిరినట్టే భావించాలి. 

అయితే రాజకీయాల్లోనూ, కింగ్ మేకింగ్ లోనూ ఎంతో పేరున్నరామోజీ.. అంత సులువుగా పాఠకులకు చిక్కరు. ఒకవేళ జగన్ తో సయోధ్య కుదిరినా.. అది అంత ఈజీగా బయటపడేలా ఉండదని.. ఆయన గురించి సుదీర్ఘకాలంగా అవగాహన ఉన్నవారు చెబుతున్నమాట. కాకపోతే.. గతంలో జగన్ ను పూర్తిగా విస్మరించిన ఈనాడు గ్రూప్.. ఇప్పుడు ప్రతిపక్షనేత హోదాకు తగినంత ప్రచారం కల్పించొచ్చు. ఎందుకంటే అది సమర్థించుకునే అవకాశం కనుక. చూడాలి మరి ఈనాడు గ్రూప్ కవరేజ్ ఎలా ఉంటుందో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: