తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మీడియాపై మొదట్లో కఠినంగా వ్యవహరించారు. ఏకంగా టీవీ 9 వంటి నెంబర్ వన్ ఛానల్ నే అప్రకటితంగా నిషేధం విధించి దారికి తెచ్చుకున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని అదే రీతితో బెదిరించినా దారి రాలేదన్న సంగతి తెలిసిందే. ఇక కేసీఆర్ స్వయంగా రామోజీ ఫిలింసిటీకి వెళ్లి రామోజీని ఆకాశానికెత్తేశాక ఈనాడు గ్రూప్ కూడా ప్రసన్నం అయ్యింది. 

కేసీఆర్ తో ఉన్న స్నేహభావమో.. ఏమో కానీ వైసీపీకి చెందిన సాక్షి పత్రిక కూడా కేసీఆర్ పట్ల సానుకూల కథనాలే ఇస్తోంది. అడపాదడపా నెగిటివ్ కథనాలు ఇస్తున్నా.. అవి అంత పట్టించుకోవాల్సినవి కావు. సో.. ఓవరాల్ గా తెలంగాణ మీడియాలో కేసీఆర్ కు వ్యతిరేకంగా, ప్రభుత్వ వ్యతిరేకంగా పెద్దగా వార్తలు కనిపించడం లేదు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మాత్రం తనదైన శైలిలో కేసీఆర్ పై అవసరమైనప్పుడల్లా కత్తికడుతూనే ఉంది.

మీడియా విషయం ఇలా ఉంటే.. తెలంగాణలో రాజకీయ పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోలేకపోతోంది. పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకత్వం కాంగ్రెస్ లో లేదు.. జానారెడ్డి కూడా కేసీఆర్ పట్ల సాఫ్ట్ కార్నర్ తోనే వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీలో లేచి పెద్దలు జానారెడ్డిగారు అనగానే ఆయన కూల్ అయిపోతున్నారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీని బలమైన ప్రతిపక్షంగా తీర్చిదిద్దాలని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు. కానీ తెలుగుదేశాన్ని అంత సులభంగా అక్కున చేర్చుకునే పరిస్థితి తెలంగాణలో లేదు. ఐతే.. రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో మీడియా సరైన పాత్ర పోషించడం లేదని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. 

రైతులు ఆత్మహత్యలు, అవినీతి పెచ్చుమీరుతుంటే.. మీడియా వాటిని సమర్థంగా ఫోకస్ చేయడం లేదంటున్నారు. ఈనాడు, సాక్షిలను పేరు పెట్టి అనకపోయినా.. కెసిఆర్ కు మీడియా కూడా భయపడుతోందని... పరోక్షంగా చురకలు వేశారు. తెలంగాణలో మీడియా వాస్తవాలు బయటపెట్టడం లేదని అన్నారు. దైర్యంగా సమాజంలో జరిగే అక్రమాలను మీడియా బయటపెట్టాలని రేవంత్ సూచించారు. అంటే రామోజీ, జగన్ కేసీఆర్ కు భయపడుతున్నారన్నదే కదా రేవంత్ రెడ్డి మనసులో మాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: