ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వాన పరంపర మొదలైంది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీని స్వయంగా కలిసి రాజధాని శంఖుస్థాపనకు రావలిసిందిగా కోరిన చంద్రబాబు నాయుడు సన్యాసులను, యోగాపాసకులను కూడా ఆహ్వానించడానికి సిద్ధపడిపోయారు తప్పితే సొంత రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతతో సహా తన వైరి పక్షాలవారిని ఖాతరు చేయడం లేదు. గతంలో కూడా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఏ ముఖ్యమైన కార్యక్రమానికీ గౌరవపూర్వకంగా రాష్ట్ర నేతలను ఆహ్వానించని చంద్రబాబు ఇప్పుడు కూడా అదే పంధాలో సాగిపోతున్నారు.

కేంద్రంలో మంత్రులందరి నివాసాలకు చక్కర్లు కొట్టడానికి చంద్రబాబుకు సమయం ఉంటుంది. విదేశాలకు ప్రైవేట్ విమానాల్లో చక్కర్లు కొట్టడానికి సమయం ఉంటుంది. వ్యాపార వాణిజ్య వర్గాలతో భేటీలతో షో బిజినెస్ చేయడానికి సమయం ఉంటుంది. కాని రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రజానేతలకు నచ్చచెప్పి ఒప్పించడానికి మాత్రం సమయం ఉండదు. వెయ్యేళ్ల రాజధానిని నిర్మిస్తానంటూ గొప్పలు చెప్పుకుంటున్న వారికి పదిమందినీ కలుపుకుని పోయే మార్గం ఇప్పటికీ తెలీకపోవటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం కాక మరేమిటి?

అందరినీ ఆహ్వానిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి వంటివారిని ఆహ్వానించరా అని విలేకరులు నిగ్గదీస్తే అందరూ ఆహ్వానితులే.. అంటే ఆయన కూడా ఆహ్వానితులే అంటూ ముక్తసరిగా జవాబిచ్చి తప్పుకున్నారు మంత్రి నారాయణ. రాజధానికి భూమిపూజ అంటూ రాష్ట్రంలోని ప్రముఖనేతలకు తపాలా ద్వారా కవరులో ఆహ్వానం పంపిన చరిత్ర గల ప్రభుత్వం ఈసారైనా కాస్త గౌరవపూర్వకంగా ఆహ్వానాలు పంపే సంస్కారం ప్రదర్శిస్తుందా అన్నది ఇప్పుడు పజిల్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: