తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రులను తరిమేస్తామని కొందరు నేతలు అప్పట్లో విషప్రచారం చేశారని మంత్రి కె. తారకరామారావు కొత్తగా మళ్లీ గుర్తు చేశారు. పలు పార్టీలకు చెందిన నేతలను తెరాస పార్టీలోకి చేర్చుకున్న సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానం పలుకుతున్న సందర్భంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కాస్త పరిశీలించాల్సిన అవసరం ఉంది.

 

మీరు ప్రభుత్వ రథ సారధులయ్యాక అయినా విద్వేషాన్ని ప్రేరేపించే మాటలు, సవాళ్ళు తగ్గుముఖం పడతాయని అందరూ ఆశించారు. కానీ జరిగిందేమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? మీ మాటకు ఎదురు తిరిగితే, మిమ్మల్ని కాస్త విమర్శిస్తే, జరుగుతున్న దారుణాలను రిపోర్టు చేస్తే, మీ విధానాల వెనుక జరుగుతున్న అవినీతిని ఎత్తిపడితే వారంతా సీమాధ్రుల తొత్తులూ, గోతికాడ నక్కలూనా?

 

తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆంధ్రోళ్లు, వలసోళ్లు అంటూ మీరు రోజుకు వందసార్లు తిడుతుంటే, టీవీల్లో గేలి చేస్తుంటే బాధపడని, ఘోషించని ఆంధ్ర ప్రజలు లేరు. తాము చేయని తప్పులకు తమను పొద్దస్తమానం నిందిస్తుంటే విలవిల్లాడిపోయారు వారు. ఇప్పుడు మీరు డైరెక్టుగా సీమాంధ్రులని, ఆంధ్రోళ్లని అనరు. కానీ మీ పత్రిక, మీ టీవీ ద్వారా ఆంధ్రులకు వ్యతిరేకంగా సమస్త విషాన్నీ చిలుకుతూనే ఉన్నారు. పత్రిక ధర్మాని కూడా మర్చి మెయిన్ పేజీలో, లోపలి పేజీల్లో, చివరికి సంపాదకుడి కాలమ్‌లో కూడా ఆంధ్రోల్లను, ఆంధ్రోళ్ల పత్రికలను, వాటి కథనాలను ఆడిపోసుకోకుండా ఒక్క రోజు గడుపుతున్నారా?

 

హైదరాబాద్‍లో పదేళ్లు కొనసాగే హక్కు వారికి దఖలు పడింది కాబట్టి ఆంధ్రోళ్లు బతికిపోయారు. లేకుంటే వారి పునాదులను లేపనంతవరకు మీరు నిద్రపోయేవారా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాటేమిటో కానీ, మీరూ అడ్డంగా దొరికిపోయే ప్రమాదాన్ని పసిగట్టి సైలెంట్ అయిపోయారు కానీ లేకుంటే మీ పత్రికలో వచ్చే విద్వేషపు రాతలను ఎవరైనా ఆపగలిగేవారా? సీమాధ్రులపై విషం కక్కుతున్నారో లేదో చెప్పాల్సింది మీరు కాదు కేటీఆర్. రోజువారీ జీవితంలో అవమానాలు ఎదుర్కొంటున్న వారు చెప్పాలి ఆమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: