నిజం మాట్లాడితే నిష్టూరంగానే ఉంటుంది. కానీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఈ సామెతలన్నీ నికార్సైన నిజం గురించి మాట్లాడాల్సి వస్తే గుర్తొస్తాయి. రాజకీయ నాయకులకూ నిజానికి అస్సలు పొంతన కుదరదు. నాయకుడనేవాడు చెప్పే మాటల్లో నూటికి 90 అబద్దాలే ఉంటాయని వారి గురించి తెలిసిన వారు చెబుతుంటారు. కానీ అప్పుడప్పుడు వారు కూడా నిజాలు చెబుతారు. 

ఎంతైనా నాయకులు కూడా మనుషులే కదా.. వారికీ హృదయం ఉంటుంది కదా.. అది అప్పుడప్పుడూ మెదడును డామినేట్ చేస్తుంటుంది. వాస్తవాలు చెప్పేలా ప్రేరేపిస్తుంది. లేటెస్టుగా ఏలూరులో అదే జరిగింది. అక్కడో ప్రభుత్వ కార్యక్రమం జరుగుతోంది. పేద లబ్దిదారులకు రుణాలు ఇస్తున్నారు. కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీతో పాటు స్టేజ్ పైన మంత్రులు కూడా ఉన్నారు. 

అలాంటి సందర్భంలో ఎవరైనా అధికార పార్టీ గొప్పదనం గురించి పథకాల గురించి గొప్పలు చెప్పడం వెరీ కామన్. కానీ విచిత్రంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ మాగంటి బాబు మాత్రం నిఖార్సైన, చేదైన నిజాలు బహిరంగంగా వెల్లడించి జనాలను, స్టేజ్ పైనున్న మంత్రులను ఆశ్చర్యపరిచేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నంత అవినీతి ఎక్కడా లేదని.. నాయకులు ఇష్టారీతిన దోచుకుంటున్నారని అందరి ముందూ హృదయం విప్పేశారు. 

అధికారులు, నాయకుల అవినీతి ఎక్కడిదాకా వెళ్లిందంటే.. చివరకు పసిపిల్లలకు పెట్టే బియ్యం, పప్పుల్లోనూ నాసిరకం పెట్టి.. ఎక్కువ బిల్లులేసుకుని పందికొక్కుల్లా తింటున్నారని మొహమాటం లేకుండా కడిగేశారు. ఈ అవినీతి వల్ల ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆ ఫలాలు పేదలకు అందడం లేదని వాపోయారు. తాను ఇటీవల ఓ నిజాయితీ అధికారిని కలిసినప్పుడు ఆయన ఎన్నో వాస్తవాలు చెప్పారని.. రాష్ట్రంలోనే ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదని బాధపడ్డారని చెప్పుకొచ్చారు. 

నిజమే ఇలా నాయకులు అప్పుడప్పుడు ఆత్మశోధన చేసుకుంటే.. జనం కోసం పెట్టే ఖర్చు మొత్తం కాకపోయినా కనీసం మూడొంతులైనా వారికి చేరగలిగితే.. నిజంగా దేశం, రాష్ట్రం ఎప్పుడో బాగుపడేవే. మాగంటి బాబు ధైర్యంగా నిజం మాట్లాడినా.. సర్కారు పరువు తీసినందుకు ఎలాంటి చర్యలు ఎదుర్కొంటారో ఏంటో పాపం.


మరింత సమాచారం తెలుసుకోండి: